కూసుమంచి, సెప్టెంబర్ 25 : పాలేరు కాల్వ మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. బుధవారం సాయంత్రానికి సాగర్ ఆయకట్టుకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు పాలేరు రిజర్వాయర్‌కు ఉదయం నుంచి క్రమంగా వరద పెరగడంతో బుధవారం సాయంత్రం వరకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.
దీంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. హట్యాతండా వద్ద ఉన్న యూటీ పూడ్చివేయడంతో కాల్వకు మరో పక్కన నీటి నిల్వలు లేకుండా మూడు 100 హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేసిన వచ్చిన నీటిని వచ్చినట్లు మళ్లీ సాగర్ ప్రధాన కాల్వలోకి వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్‌కు ఈ నెల ఒకటో తేదీన వచ్చిన వరదలతో ఏర్పడిన గండి కారణంగా క్రమంగా 16 అడుగులకు చేరిన నీటిమట్టం.. వర్షంతో పెరుగుతూ సాయంత్రానికి 18.5 అడుగులకు చేరింది. గురువారం రాత్రి వరకు 20 అడుగుల వరకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది.
పాలేరు కాల్వ పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రతి గంటకు కాల్వ లెవల్, బండ్‌పై పెంచుతున్న ఎత్తు, నీటి ప్రవాహం, యూటీ డీ వాటరింగ్పై ప్రత్యేకంగా ఆరా తీశారు. వర్షం కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తిగా నీటిని వదిలేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీఈ విద్యాసాగర్‌ను ఆదేశించారు.
హట్యాతండా వద్ద కాల్వకు పడిన గండి, యూటీ లీక్‌ను పూడ్చివేసి కాల్వ బండ్‌ను మట్టితో నింపుతున్న పనులకు భారీ వర్షంతో ఆటంకం కలిగింది. మట్టిని తరలించే ప్రాంతంలో నీరు నిలవడంతో తోలకానికి ఇబ్బందులు తలెత్తాయి. తిరిగి అధికారులు మధ్యాహ్నం నుంచి మళ్లీ మట్టి తోలకం పనులు చేపట్టారు.
కాల్వపై జరుగుతున్న పనులను సీఈ విద్యాసాగర్ బుధవారం పరిశీలించారు. మట్టి తోలకం, కాల్వలో నీటి ప్రవాహాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈఈ అనన్య, డీఈ మధు, మరో ఈఈ మంగలపుడి వెంకటేశ్వర్లు, డీఈ మన్మధరావు పాల్గొన్నారు