మణుగూరు మండలం శివలింగాపురం గ్రామస్తులు తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. బిందెడు నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పైపులైన్ల మరమ్మతులు, కొత్త పైపులు వేస్తుంటే ఇక మాకు తాగునీరు ఎప్పుడు అందిస్తారంటూ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. గుక్కెడు నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎండలు విపరీతంగా పెరిగినప్పుడు మా గోస ఎవరు పట్టించుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.
మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు పనులు శివలింగాపురం గ్రామంలో ఇంకా పూర్తికాలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంపించిన పైపులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అయిన తర్వాత ఇప్పుడు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని పలువురు ఆరోపిస్తున్నారు.ఇల్లెందు మండల పరిధిలోని నెహ్రూనగర్ తండా పంచాయతీ ఒడ్డుగూడెం గ్రామంలో ప్రజలు తాగునీటికి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒడ్డుగూడెం గ్రామంలో 40 వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు సరిపడా నీరు అందేది. బోరు బావిలో మోటారు ట్యాంకు ద్వారా వాటర్ ట్యాంకును నింపుతూ ప్రజల అవసరాల నిమిత్తం నీటిని సరఫరా చేసేవారు.
నీటి సరఫరాకు ఎలాంటి కొదవలేదు. కానీ.. ప్రస్తుతం మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. అది కూడా 20 వేల లీటర్ల సామర్థ్యం కలది. దీనినుంచి కొంతమంది ఇండ్లకు కనెక్షన్ ఇవ్వలేదు. మరమ్మతుల పేరిట పాత 40 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు కూడా సరిగ్గా రావడం లేదు. వచ్చినా ఊరి ప్రజల నీటి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో గ్రామస్తులు పాత బావి వద్ద ఉన్న బోరుకు కనెక్షన్ ఇచ్చుకుంటూ ఇంటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకుంటూ వస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం గ్రామస్తుల నీటి కష్టాలను తొలగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అధికారులు పాత 40 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును ఉపయోగంలోకి తీసుకొస్తే మొత్తంగా రెండు కలిపి 60 వేల లీటర్ల సామర్థ్యంతో ఊరి ప్రజలకు పుష్క లంగా నీరు అందుతుంది.
మాకు తాగునీరు సక్రమంగా రావడం లేదు.. అనేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. మా గోడు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థంకావడం లేదు. ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి చూస్తున్నారు తప్ప నీళ్లు మాత్రం ఇవ్వడం లేదు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
– బీరా రమేశ్, శివలింగాపురం, మణుగూరు మండలం
పాత 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును నిరుపయోగంగా మార్చారు. పాత వాటర్ ట్యాంకుతో ఊరి ప్రజలకు పుష్కలంగా నీరు సరిపోయేది. ప్రస్తుతం నీటి కొరత చాలా ఉంది. పైపులు పట్టుకుని బావి బోరు వద్దకు ఉరుకుతున్నాం. బావి బోరు నీటినే ఉపయోగించుకుంటున్నాం. మిషన్ భగీరథ నీరు ఒక్క బజారుకే సరిపోతున్నది.
– భూక్యా అమ్మి, ఒడ్డుగూడెం, ఇల్లెందు మండలం
మా ఊర్లో మిషన్ భగీరథ పైపులైన్లు ఇంకా వేయనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మాకు నీరు అందడం లేదు. ప్రైవేట్ బోర్లను ఆశ్రయిస్తే రెండు రోజులకొకసారి నీళ్లు వస్తున్నాయి. ఇంట్లో అవసరాలకు నీళ్లు సరిపోవడం లేదు. ఎవరైనా బంధువులు ఇంటికొచ్చినా, ఏదో చిన్న శుభకార్యం జరిగినా బయట నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుంటున్నాం. అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి.
– కాశిమళ్ల కాశమ్మ, శివలింగాపురం, మణుగూరు మండలం
వేసవికాలం వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు అంతా ఇంతా కాదు. ఇంట్లో ఏ పని జరగాలన్నా ముందు పుష్కలంగా నీళ్లు ఉండాలి. కూలీ పనులకు వెళ్లేవారికి ఇంకా కష్టతరమవుతోంది. మిషన్ భగీరథ పైపులు ఇంకా పూర్తిగా వేయలేదు. ప్రైవేట్ బోర్లపై ఆధారపడితే అక్కడ కూడా రద్దీ పెరుగుతోంది. అధికారులకు విన్నవిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు.
– బెల్లంకొండ చుక్కమ్మ, శివలింగాపురం, మణుగూరు
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చినా ఇళ్లకు కూడా సరిపడా నీరు రావడం లేదు. పైపులైన్ లీక్ అవుతున్నది. అధికారులు గుర్తించి మరమ్మతులు చేయించిన దాఖలాలు లేవు. వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లినా అక్కడ కూడా ధార సన్నగా వస్తున్నది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుతో గ్రామస్తులకు ఎలాంటి ఉపయోగం లేదు. పాత వాటర్ ట్యాంక్ నీరు గ్రామస్తులకు సరిపోయేవి.
-సరోజ, ఒడ్డుగూడెం, ఇల్లెందు మండలం