Illendu | ఇల్లెందు, మార్చి 28 : ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఇల్లెందు మండలం బోయి తండాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందు మండలం బోయ తండా గ్రామానికి చెందిన వాంకుడోత్ శ్రీకాంత్- కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవితం సాగిస్తున్నారు. వాళ్లకు ఆర్యన్ అనే 18 నెల బాలుడు ఉన్నారు.
వీరికి చెందిన ట్రాక్టర్ను సమీప బంధువు బానోతు వినోద్ బయట నుండి ఇంట్లో పెట్టే క్రమంలో ఏడాదిన్నర బాలుడు ఆడుకుంటూ ట్రాక్టర్ వెనకవైపు వచ్చాడు. అది గమనించని డ్రైవర్ వినోద్ వెనక్కి ట్రాక్టర్ను తీసుకురావడంతో బాలుడు తలకు తీవ్ర గాయం అయింది. తట్టుకోలేనంత బాధతో ఆ బాలుడు ఒక్కసారిగా ఏడ్చాడు. అది విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా వచ్చి బాలుడిని తీసుకొని ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్యన్ ప్రాణాలొదిలాడు. ఏడాదిన్నరకే నీకు నూరేళ్లు నిండాయా అని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.