ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 10: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభంకావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్‌యార్డు పోటెత్తింది. ఖమ్మం జిల్లా నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి సైతం రైతులు ఊహించని విధంగా పంటను తెచ్చారు. గత వారం ఒకేరోజు సుమారు 75 వేల బస్తాలు రాగా సోమవారం ఏకంగా లక్ష బస్తాలు వచ్చాయి. జెండాపాటలో ఖరీదుదారులు క్వింటా మిర్చి ధరను రూ.14 వేలుగా నిర్ణయించారు.
అయితే అంతకుముందుగా రూ.13,600గా నిర్ణయించడంతో రైతులు, కొంతమంది అడ్తీదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు రూ.14 వేలుగా ఫైనల్ చేశారు. వందలాది మంది రైతులు పంటను తీసుకొచ్చినప్పటికీ కేవలం ఒక్కరిద్దరికి మాత్రమే జెండాపాట ధర పలకడం గమనార్హం. మిగిలిన రైతుల పంటకు అత్యధిక ధర క్వింటాకు రూ.12,500 నుంచి రూ.13,500 పలికింది. క్రయవిక్రయాలకు యార్డు సరిపోకపోవడంతో వాహనాలు బయటనే నిలిచిపోయాయి. తాలురకం ధర మరింత క్షీణించింది. అడిగే నాథుడు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన తాలు రకానికి ధర నిర్ణయించి కొనుగోలు చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మిర్చియార్డులో దళారుల హవా కొనసాగుతున్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దడవాయిలు లేకుండానే కొందరు వ్యాపారులు కాంటాలు వేసుకుంటున్నారు. యార్డులో అక్కడే కొనుగోలు చేసి కాసేపటి తర్వాత తిరిగి అసలు ఖరీదుదారులకు అక్కడే పంటను అమ్ముతున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే చిల్లర వ్యాపారులమని చెప్పుకోవడం కొసమెరుపు. ప్రస్తుతం మిర్చిమార్కెట్‌లో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 40 నుంచి 50 మంది వ్యక్తులు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా యార్డులో రైతుల వద్ద పంటను కొనుగోలు చేస్తున్నారు.
అన్నదాతల అవసరాలను ఆసరాగా తీసుకొని అక్కడే పంటను కొనుగోలు చేసి వెంటనే బస్తాలను ప్రత్యేకంగా వారికి కేటాయించిన షెడ్లలో డంప్ చేసి తిరిగి అసలు వ్యాపారులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. దీంతో నిత్యం 10 వేల బస్తాల లెక్కలు రికార్డులో నమోదు కాకుండా కాంటాలు వేసుకుంటున్నారు. పైగా అలా వేసుకున్న బస్తాలకు హమాలి, రెల్లుడు, దడవాయిల చార్జీల పేరుతో ఒక్కో బస్తాకు రూ.22 వరకు రైతుల వద్ద కట్ చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అప్పుడప్పుడు మార్కెట్ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.