మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తికావడంతో గులాబీ దళం ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ)లో ఇప్పటికే నామినేషన్లు వేసి జిల్లా బాధ్యుల నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్న పలువురు అభ్యర్థులు, ఆయా డివిజన్ల పార్టీ ఇన్చార్జులు కలిసి ప్రజలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను చూపుతూ, దాని వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కారు గుర్తుపై ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 31 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. మూడుచోట్ల ఇన్చార్జులను కూడా బీఆర్ఎస్ నియమించడంతో అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులతో కలిసి ఆయా ఇన్చార్జులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదేగాక ఆయా మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్ నుంచి భారీగానే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈసారి మున్సిపల్ పోరులో యువకెరటాలకు టికెట్లు ఇవ్వడంతో ప్రచారంలో గులాబీదళం దూసుకెళ్తోంది.
రెబల్స్ బెడద..
డివిజన్లు, వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికమంది టికెట్లు ఆశించారు. కానీ, పైరవీకారులకే ఆ పార్టీ నేతలు టికెట్లు కేటాయించడంతో పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారంతా భంగపడ్డారు. దీంతో వారంతా కలిసి ఆయా వార్డులు, డివిజన్లలో రెబర్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అధికార పార్టీ నుంచి ఈ తిరుగుబాటు అభ్యర్థులు ఒక్కో వార్డుకు, డివిజన్‌కు ముగ్గురు నుంచి నలుగురి వరకూ ఉన్నట్లు నామినేషన్ల సంఖ్యలు చెబుతున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ నుంచి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు. దీంతో ఉపసంహరణ వరకు ఎవరు విత్‌డ్రా అవుతారో లేదో అంటూ పోటీలో ఉన్న అభ్యర్థులకు బెంగ పట్టుకుంది.
తేలని పొత్తులు..
కాంగ్రెస్, సీపీఐ పొత్తుల వ్యవహారం ఇంకా తేలలేదు. దీంతో ఇటు క్యాడర్‌లోనూ, అటు అభ్యర్థుల్లోనూ ఆందోళనలు, అయోమయాలు మొదలయ్యాయి. ఇటీవలి వరకూ జరిగిన చర్చల్లో పొత్తుల అంశం తేలకపోవడంతో ఆ రెండు పార్టీల నాయకులు చర్చల నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అందుకే ఆయా పార్టీల నుంచి ఎవరికి వారుగా నామినేషన్లు వేశారు. పరస్ఫరం పోటీకి సై అంటున్నారు. కొత్తగూడెంలో గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వార్డు కౌన్సిలర్ ఒక్కరే గెలిచారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఆశించడంతో ఆ ప్రతిపాదనను సీపీఐ తిరస్కరిస్తోంది. అదీగాక సీపీఐ సిట్టింగ్ స్థానాలు కూడా కాంగ్రెస్ అడుగుతుండడంతో సీపీఐ ససేమిరా అంటోంది. దీంతో పొత్తులు పొసగడం లేదు. దీంతో ఎవరికి వారే పోటీలో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.
1,271 నామినేషన్లు..
భద్రాద్రి జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు కలిపి మొత్తంగా 1,271 నామినేషన్లు దాఖలయ్యాయి. అశ్వారావుపేటలో 22 వార్డులకు గాను మొత్తం 146 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లకు గాను 806 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ నుంచి 328, కాంగ్రెస్ నుంచి 382, సీపీఐ నుంచి 125, బీజేపీ నుంచి 123, ఇతరుల నుంచి 211 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండడంతో ఆ రెండు పార్టీల నేతలు ఎంతమంది రెబల్స్ నుంచి నామినేషన్లను ఉపసంహరింపజేస్తారో చూడాలి.