కొత్తగూడెం అర్బన్, జూన్ 23 : వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థ కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ పురోగభివృద్ధి బాటలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నది. ఈ క్రమంలో సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం 2020 జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా లాజిస్టిక్స్ సర్వీస్(కార్గో, పార్సిల్ సేవలు) ప్రారంభించింది. ప్రారంభం నుంచే ప్రజలు ఆదరించడంతో ఆశించినదాని కంటే ఎక్కువగా సక్సెస్ అయ్యింది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా, తక్కువ చార్జీలతో సేవలను అందిస్తుండడంతో లాజిస్టిక్స్ సేవల వైపు మొగు ్గచూపుతున్నారు. దీనికితోడు ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణం అనే భావన ఉండడం కూడా సంస్థకు కలిసివచ్చింది.
ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు మూడు డిపోల నుంచి సంస్థకు మూడేళ్ల కాలంలో రూ.12.28 కోట్లు సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా లాజిస్టిక్ సేవలను ప్రజలు చక్కగా ఉపయోగించుకున్నారు. ఆరు డిపోల పరిధిలో ప్రైవేట్ ఏజెన్సీలను సైతం ఏర్పాటు చేసింది. తక్కువ చార్జీలతో ప్రజలు సకాలంలో తమకు కావాల్సిన వస్తువులను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటూనే, తాము పంపాల్సిన వస్తువులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు ఆర్టీసీ సేవలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడేళ్లలో ఖమ్మం డిపో పరిధిలో 3,60,524 పార్సిల్స్ ద్వారా రూ.4.40 కోట్లు, మధిర డిపో పరిధిలో 44,370 పార్సిల్స్ ద్వారా రూ.55.80 లక్షలు, సత్తుపల్లి పరిధిలో 1,58,647 పార్సిల్స్ ద్వారా రూ.2.70 కోట్లు, కొత్తగూడెం డిపో పరిధిలో 1,60,023 పార్సిల్స్ ద్వారా రూ.2.14 కోట్లు, భద్రాచలం పరిధిలో 1,33,529 పార్సిల్స్ ద్వారా రూ.2.60 కోట్లు, మణుగూరు పరిధిలో 62,745 పార్సిల్స్ ద్వారా రూ.66 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తంగా 9,91,435 పార్సిల్స్ ద్వారా రూ.12.28 కోట్ల ఆదాయం సంస్థ ఖజానాకు జమైంది.
టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రారంభించినప్పటి నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. కార్గో, పార్సిల్, కొరియర్ సేవల ద్వారా సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ప్రజలు అందిస్తున్న సహకారంతో ఆశించిన దానికంటే ఎక్కువగానే స్పందన వచ్చింది. ప్రైవేట్‌కు దీటుగా తక్కువ చార్జీలతో సర్వీస్ చేస్తుండడం సంస్థకు కలిసివచ్చింది. ఆర్టీసీపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రజలు ఇదే విధమైన సహకారం అందిస్తే ఆర్టీసీ మరింత బలోపేతమవుతుంది.
– ఎం.వేణుగోపాల్, ఖమ్మం, వరంగల్ రీజియన్ ఇన్చార్జ్
ఆర్టీసీ కార్గో, పార్సిల్, కొరియర్, పెరిసబుల్ వస్తువుల సర్వీస్‌లను మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, హోల్‌సేల్, కూరగాయల వ్యాపారులు, డెకరేషన్ చేసే యజమానులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఉమ్మడి జిల్లా వ్యాపారులు తమకు కావాల్సిన వస్తువులను ఆర్టీసీ సర్వీస్‌ల ద్వారా తెప్పించుకొని ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ప్రాంతాల ప్రజలు ఆటోమోబైల్ వస్తువులు, బియ్యం, పప్పులు, కూరగాయలు, డెకరేషన్ వస్తువుల కోసం విజయవాడకు తరుచూ వెళ్తుంటారు. కానీ ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవల వల్ల వారు ఆ ప్రాంతానికి వెళ్లకుండానే తమకు నచ్చిన, అవసరమైన వస్తువులను సులభంగా తెప్పించుకుంటున్నారు. ఆర్టీసీ సంస్థ సురక్షితంగా ప్రయాణికులను ఎలా చేరవేస్తుందో అదే విధంగా వస్తువులను సైతం అదే రీతిలో డ్యామేజ్ లేకుండా అందిస్తున్నది. దీనికి తోడు తక్కువ చార్జీలే సేవలకు వసూలు చేస్తుండడం, ఎక్కువ లోడ్ ఉన్న వస్తువులను కార్గోలో బుక్ చేస్తే నేరుగా యజమాని చెప్పిన చిరునామాకే వచ్చి వస్తువులను అందించడంతో ప్రజలు కూడా ఆర్టీసీ వైపే మొగ్గు చూపుతున్నారు.