ఖమ్మం, జూన్ 4: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో 11 మంది తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఐపీఏల్ ఫైనల్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయం సాధించిన సందర్భంగా ర్యాలీ తీస్తుండగా తొకిసలాట చోటుచేసుకోవడం, భద్రతా సిబ్బంది క్రికెట్ అభిమానులను అదుపు చేయలేకపోవడం వంటి కారణాలతో 11 మంది మృత్యువాత పడడం దురదృష్టకరమని అన్నారు.
ఈ తొకిసలాటలో గాయపడిన వారికి సత్వరమే మరింత మెరుగైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే.. మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు రవిచంద్ర తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.