ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 13: ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఇన్స్పైర్ కోసం తమ ప్రాజెక్టులు నమోదు చేసుకోగా వాటిల్లో 119 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇలా ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పున పారితోషికాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నగదుతో విద్యార్థులు ప్రాజెక్టును తయారుచేసి ప్రదర్శించాల్సి ఉంటుంది. 119 ప్రాజెక్టుల్లో 111 ప్రాజెక్టులు ప్రభుత్వ పాఠశాలలవే. కేవలం 8 మాత్రమే ప్రైవేట్ పాఠశాలలవి.
‘ఇన్స్పైర్ మానక్’, ‘సైన్స్ఫెయిర్’ ప్రదర్శనలను ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. నగరంలోని పాత డీఈవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సైన్స్ఫెయిర్లో నమోదుకు ఈ నెల 16 వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులను యాజమాన్యాలు ప్రోత్సహించాలని కోరారు. జిల్లాస్థాయి ప్రదర్శనలు నిర్వహించేందుకు విద్యార్థుల ప్రాజెక్టుల నమోదు సంఖ్య ఆధారంగా కలెక్టర్కు నివేదించనున్నారు. కమిటీల రూపకల్పన, ఇతర నిర్వహణ అంశాల్లో సహకరించాలని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను డీఈవో సోమశేఖరశర్మ కోరారు.
సైన్స్ఫెయిర్ ప్రదర్శనల్లో విద్యార్థులు థర్మాకోల్ అట్టలను, డ్రాయింగ్ షీట్లను, ఫ్లెక్సీలను ప్రదర్శించరాదని డీఈవో స్పష్టం చేశారు. వీటితో తయారుచేసే ప్రాజెక్టులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు, ఎంఈవోలు, సైన్స్ అధికారి, ప్రైవేట్ స్కూళ్ల బాధ్యులు పాల్గొన్నారు.