రఘునాథపాలెం, ఫిబ్రవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు సోమవారం ఏకంగా సుమారు 1.05 లక్షల బస్తాలను తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ నిండిపోవడంతో గేట్ల ముందే మిర్చి బస్తాలను దింపారు. సోమవారం మిర్చి ధర జెండా పాటలో రూ.14,125 పలికింది.
కానీ వ్యాపారులు మాత్రం జెండా పాటను ఖాతరు చేయడం లేదు. జెండా పాటకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ క్వింటాకు రూ.500 నుంచి రూ.1000 తగ్గించి కొనుగోళ్లు జరిపారు. వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు మాత్రం అటుగా కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించి రైతులు మోసపోతున్నారు.