భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వారంరోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద చేరింది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి తీరప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాలుగురోజుల క్రితం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి భద్రాచలాన్ని వరద వదలడం లేదు.
ఇప్పటికి మూడుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేసి విత్‌డ్రా చేసిన సందర్భాలు ఉండడంతో వరద గోదావరి ముంపు బాధితులతో దోబూచులాడుతున్నది. చివరికి శనివారం 4గంటలకు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 53 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం క్రమేపీ పెరగడంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజుల నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. దీంతో ఎగువ భాగం నుంచి భారీగా గోదావరిలోకి వరద చేరుతున్నది.
53 అడుగులు
వారంరోజుల తర్వాత తొలిసారిగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ విపాటిల్ ప్రకటించారు. ఇప్పటికి మూడుసార్లు రెండో ప్రమాద హెచ్చరిక వరకు వరద ప్రవాహం పెరుగుతూ తగ్గుతూ రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కరకట్ట ప్రదేశంలో స్లూయిస్‌లు లీకులుకావడంతో ఇసుక బస్తాలను వేసి లీకులను అరికట్టారు. మోటర్ల రిపేరు ఉంటే వెంటనే వాటిని రిపేరు చేయించారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రాత్రి 8 గంటలకు 53.40 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.
భద్రాచలానికి పక్కనే ఉన్న ఆంధ్రా ప్రాంతానికి కూడా తెలంగాణతో రాకపోకలు తెగిపోయాయి. అటు శబరి.. ఇటు గోదావరి నదులు పొంగిప్రవహించడంతో చింతూరు-చట్టి రహదారిపైకి నీరు చేరి నెల్లిపాక నుంచి చింతూరు వెళ్లే రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం రోడ్డులో వరద రహదారి పైకి చేరడంతో వీఆర్‌పురం వెళ్లే రహదారికి రాకపోకలు లేవు. దీంతో అటువైపు వెళ్లే వాహనాలను సారపాక క్రాస్‌రోడ్ వద్దనే నిలిపివేశారు. దీంతో పెద్దఎత్తున రాకపోకలు స్తంభించాయి.
భద్రాచలం పట్టణం వద్ద గోదావరి వరద శనివారం సాయంత్రం 4గంటలకు 53 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని, అధికార యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
పర్ణశాల, జూలై 27 : దుమ్ముగూడెం మండలంలో ప్రవహిస్తున్న గోదారమ్మ తగ్గుతూ పెరుగుతూ దోబూచులాడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ గ్రామాలు ముంపునకు గురవుతాయని భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద చేరి రహదారులు దిగ్బంధం కాగా మళ్లీ శనివారం తెల్లవారుజాము నుంచి గోదావరి పెరిగి సున్నంబట్టి, పర్ణశాల, సంగం, కాశీనగరం, తూరుబాక, ప్రధాన రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం కొనసాగుతున్నది.
దుమ్ముగూడెం, జూలై 27 : దుమ్ముగూడెం హెడ్లాక్ల వద్ద గోదావరి శనివారం సాయంత్రానికి 27.2 అడుగులకు చేరుకుంది. మండలంలోని తూరుబాక, బుర్రవేముల గ్రామాల ప్రధాన రహదారులపైకి వరద చేరింది. దీంతో భద్రాచలం, చర్ల వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నెల 20వ తేదీ నుంచి గోదావరి వరద క్రమేపీ పెరగడంతో భద్రాచలం డివిజన్‌తోపాటు బూర్గంపాడు మండలం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక- బూర్గంపాడు రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో పర్ణశాలకు రాకపోకలు లేకపోవడంతో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సున్నంబట్టి గ్రామంలోకి వరద రావడంతో ఆయా గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
చర్ల మండలం ఈతవాగు పొంగడంతో గొంపల్లి, కొత్తపల్లి, లింగాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతకుంట చెరువుకు అలుగుపడడంతో చెరువు పొంగిప్రవహిస్తున్నది. చర్ల మండలం నుంచి భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణానికి వరద ముంపు పొంచి ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొత్తకాలనీకి వరద చుట్టుముట్టడంతో 39 కుటుంబాలకు భద్రాచలంలో నన్నపునేని స్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించారు. వరద బాధితులకు ఆహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ పీవో రాహుల్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు.
చర్ల, జూలై 27 : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఒకవైపు తాలిపేరు.. మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చర్ల మండలంలోని వాగులు, చెరువులు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టులోకి ఎగువనున్న ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురిసిన వర్షాలకు భారీస్థాయిలో వరద వచ్చి చేరుతున్నది. అధికారులు 25గేట్లను పూర్తిగా ఎత్తి 1,13,752 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈతవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దండుపేట, కొత్తపల్లి, లింగాపురం, గొంపల్లి, కొత్తూరు, మొగళ్ళపల్లి, జీపీ పల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భద్రాచలం నుంచి చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండవాగులు రోడ్లపైనుంచి ప్రవహిస్తున్నాయి. సమీపపొలాలు నీట మునిగాయి.