ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు కార్యాచరణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 65 లక్షల మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. జూన్ మొదటి వారంలో ఎనిమిదో విడత హరితహారం ప్రారంభం కానున్నది. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ అధికారులు జిల్లావ్యాప్తంగా 481 పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులూ ఇదే విధంగా నర్సరీలు పెంచుతున్నారు. అటవీశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ, మున్సిపాలిటీలు, సింగరేణి ఏరియాలోని వందలాది నర్సరీలతోపాటు జిల్లావ్యాప్తంగా ఒక్కో పంచాయతీలోని నర్సరీలో సుమారు 15 వేల చొప్పున మొక్కలు పెరుగుతున్నాయి.
-కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 22
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 22: తెలంగాణ పచ్చని వనం కావాలి.. ప్రతి ఊరిలో పచ్చందాలు నిండాలి.. ప్రతి ఇల్లు మొక్కల పొదరిల్లు కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఏడేళ్ల క్రితం హరితహారం పథకాన్ని ప్రారంభించారు. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఏటా కోట్లాది మొక్కలు నాటించారు. నాడు నాటిన మొక్కలు ఇప్పుడు నలగురికీ నీడనిస్తున్నాయి. కాలుష్య రహిత సమాజానికి దోహదం చేస్తున్నాయి. వృక్షాలుగా ఎదుగుతున్నాయి. ఇదే స్ఫూర్తితో ఎనిమిదో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఈసారి 65 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొక్కల సంరక్షణపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ అధికారులు జిల్లావ్యాప్తంగా 481 పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులూ ఇదే విధంగా నర్సరీలు పెంచుతున్నారు. జూన్ మొదటి వారం నుంచి హరితహారం ప్రారంభం కానున్నది.
ఎనిమిదో విడత హరితహారాన్నీ విజయవంతం చేసేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లావ్యాప్తంగా అటవీశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ, మున్సిపాలిటీలు, సింగరేణి ఏరియాలోని వందలాది నర్సరీల్లో లక్షలాది మొక్కలు పెరుగుతున్నాయి. ఒక్కో పంచాయతీలోని నర్సరీలో సుమారు 15 వేలకు పైగా మొక్కలు పెరుగుతున్నాయి. ఈసారి హరితహార కార్యక్రమంలో అటవీశాఖ 10 లక్షలు, పోలీస్‌శాఖ 50 వేలు, సింగరేణి 10 లక్షలు, డీఆర్డీవో శాఖ 30 లక్షలు, నీటి పారుదలశాఖ 30 వేలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ లక్ష మొక్కలు నాటనున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో 5 లక్షల చొప్పున మొక్కలు నాటనున్నారు. వన సేవకులు మొక్కల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వేసవి దృష్ట్యా మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నర్సరీలను పరిశీలిస్తున్నారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
పంచాయతీలు, ఆటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో టేకు, వెదురు, దానిమ్మ, ఆకాశ మల్లి, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి, కర్జూరం, నిద్ర గన్నేరు, మల్బర్ వేప, గానుగ, వేప, కదంబ, గుల్మొహర్, మారేడు, స్పాంథోడియా, కరివేపాకు, గోరింట, ఉసిరి, చింత, రేగు, ఈత, నేరేడు వంటి 20 రకాలకు పైగా మొక్కలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమిస్తాం. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలిస్తున్నాం. గ్రామీణాభివృద్ధిశాఖకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తాం. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తాం.
– మధుసూదనరాజు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి