గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో వారికి అనేక పథకాలను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేశారు. అందులో భాగంగా కర్షకులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రతి మండలంలోనూ క్లస్టర్ల వారీగా రైతువేదిక (ఆర్వీ)లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కేసీఆర్ పొడగిట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన తెచ్చిన ఈ రైతువేదికలపైనా తన భస్మాసుర‘హస్తాన్ని’ ప్రయోగిస్తున్నది. ఇదే క్రమంలో భద్రాద్రి జిల్లాలోని సింహభాగం రైతువేదికలపై శీతకన్ను వేసింది.
వాటి నిర్వహణకు కనీసం నిధులు కూడా మంజూరు చేయడం లేదు. కనీసం వాటిల్లో రైతులకు సమావేశాలు, అవగాహన సదస్సుల వంటివి కూడా నిర్వహించడం లేదు. రైతుబంధు, రైతుబీమా, పంటల నమోదు, ధాన్యం కొనుగోళ్లు, పంట నష్టపరిహారాలు, విత్తనాలు వంటి పనుల కోసం, వాటి దరఖాస్తులు అందజేయడం కోసం గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులతో కళకళలాడిన ఈ రైతువేదికలు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వెలవెలబోతున్నాయి. కేవలం కేసీఆర్ మీద ఉన్న అక్కసు కారణంగానే ఇప్పుడు ఈ రైతువేదికలను ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం వినియోగంలోకి తేవడం లేదు.
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతువేదికలను రైతులకు ఉపయోగం లేకుండా చేసింది. భద్రాద్రి జిల్లాలో 23 మండలాల్లో 67 క్లస్టర్లకు గాను 67 రైతువేదికలను గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ప్రతి క్లస్టర్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన సమాచారాన్ని చేరవేసేది. అక్కడే ఏఈవో కూడా గదిని కేటాయించింది. కానీ ఇప్పుడు వాటిని ఏకంగా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నట్లుగా కన్పిస్తోంది. కనీసం వాటిని శుభ్రపరచడానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. నీళ్లు కూడా పట్టకపోవంతో ఆర్వీల ఆవరణల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. కొన్ని మండలాల్లో అసలు ఆర్వీల తాళాలు తీసినట్లుగా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ప్రతి మండలంలో రైతులు సమావేశాలు పెట్టుకునేందుకు వీలుగా ఒక్కో దానికి రూ.22 లక్షల చొప్పున నిధులు వెచ్చించి 67 రైతువేదికలను నిర్మించారు. కొన్ని గ్రామాల్లో అయితే రైతువేదికల నిర్మాణాలకు కొందరు దాతలు భూమిని దానంగా ఇచ్చారు. మరికొందరు దాతలు వారి కుటుంబీలకు జ్ఞాపకార్థంగా రైతువేదికల భవనాలను నిర్మించారు. మొత్తానికి ఈ రైతువేదికలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నన్ని రోజులూ నిత్యం ఏదో సమావేశంతో ఇవి కళకళలాడేవి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించడంతో వీటిల్లో సమావేశాలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్సులు నిర్వహించినప్పుడు మండల కేంద్రాల్లోని రైతువేదికలోకి వెళ్లడం తప్ప ఇతర క్లస్టర్లలోని రైతువేదికలను తెరిచిన దాఖలాలు కూడా కన్పించడం లేదు. కనీసం వాటిని ఊడ్పించకపోవడంతో భవనాలు దుమ్ముపట్టి కన్పిస్తున్నాయి.
జిల్లాలో ఉన్న 67 రైతువేదికల్లో సగానికి పైగా రైతువేదికలను ప్రసుత్త ప్రభుత్వం వినియోగించడం లేదు. ఇల్లెందు మండలం కేసముద్రం రైతువేదిక గేటుకు ఎప్పుడూ తాళం వేసే ఉంటోంది. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రైతువేదికకు అసలు అధికారులు వస్తారో రారో అనేది అనుమానంగానే ఉంది.
లోపలి కుర్చీలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాత్రూం తలుపు పగిలిపోయిన గుర్తులు కనబడుతున్నాయి. ములకలపల్లి మండలంలో నాలుగు రైతువేదికలు ఉంటే ఒకదాన్ని మాత్రమే అధికారులు ఉపయోగిస్తున్నారు. అది కూడా ఏఈవోలు మొక్కుబడిగా వచ్చి కనబడి వెళ్తుతన్నట్లు తెలుస్తోంది. ఆళ్లపల్లి మండలం మర్కోడు రైతువేదిక ఖాళీగా దర్శనమిస్తున్నది. టేకులపల్లి మండలం సంపత్నగర్లో గుట్టమీద కట్టిన రైతువేదిక పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
కట్టినప్పుడు బాగానే ఉన్నాయి..
ఈ రైతువేదికలను గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ఆ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ఈ రైతువేదికలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్వీల ఆవరణల్లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఏదైనా మీటింగ్ ఉంటే లోతువాగు దగ్గరకు రమ్మని చెబుతున్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతువేదికల్లో సమావేశాలు పెట్టాలిగానీ ఎక్కడో ఎందుకు పెట్టాలి?
– రాములు, రైతు, కారుకొండ, లక్ష్మీదేవిపల్లి
మా రైతుల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం కట్టిన రైతువేదికలను ప్రస్తుతం ఉపయోగం లేకుండా చేస్తున్నారు. వాటిల్లో నిత్యం రైతులకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చిపోతున్నారు. రైతులను పిలిచి సమావేశాలు పెట్టిన పాపానపోలేదు. వ్యవసాయ రుణాలు, ఎరువులు, పంటల పెట్టుబడి సాయాల గురించి ఏఈవోలను కలిసి అడుగుదామంటే కనీసం వాటి తాళాలు తీసి ఉండడం లేదు.
– కాసిబోయిన సతీశ్, రైతు, సూరారం, దుమ్ముగూడెం
ప్రతిరోజూ ఫీల్డ్ విజిట్ చేసి ఆ క్లస్టర్ పరిధి ఏఈవో అక్కడి రైతువేదికకు వచ్చి వెళ్తారు. నిర్వహణలేక కొన్ని నిరుపయోగంగా ఉన్నమాట వాస్తవమే. నిర్వహణ కోసం నిధులు ఏమీ లేవు. సిబ్బంది వచ్చి ఊడ్చుకుని మరీ అక్కడే ఉంటున్నారు. కొన్ని ఏరియాల్లో రైతువేదికలు గ్రామానికి దూరంగా ఉండడం వల్ల రైతులు రావడం లేదు. సమావేశాలు, వీడియోకాన్ఫరెన్సులు రైతువేదికల్లోనే జరుగుతున్నాయి.
– వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి