రేషన్ లబ్ధిదారులకు త్వరలో సన్నబియ్యం ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇచ్చేందుకే ముక్కుతున్నది. ప్రతి నెలా 1వ తేదీ నాటికే డీలర్లకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. డిసెంబర్ నెల ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా 10 శాతం కూడా చేయలేకపోయింది. బియ్యం స్టాక్ లేక ఎస్ఎఫ్సీ, ఎంఎల్ఎస్ గోదాములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 43,638 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా.. ఇప్పటివరకు కేవలం 3 వేల టన్నుల లోపు మాత్రమే డీలర్లకు చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు మిల్లుల చుట్టూ తిరుగుతూ బియ్యం కోసం బతిమిలాడుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదేమైనా ప్రతినెలా సకాలంలో రేషన్ బియ్యం అందక నిరుపేదలు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
– అశ్వారావుపేట, డిసెంబర్ 7
నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యానికి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన గడువు ముగిసినా పూర్తిస్థాయిలో బియ్యం డీలర్లకు చేరడం లేదు. సర్కార్ గోదాములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రతి నెలా 20వ తేదీ నుంచి నెలాఖరు వరకు డీలర్లకు నిర్దేశిత బియ్యం సరఫరా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ.. ప్రతి నెలా బియ్యం సరఫరాలో లక్ష్యం చేరుకోలేక అధికారులు మిల్లర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ బతిమిలాడుకుంటున్నారు. గత నెల కంటే ఈ డిసెంబర్ నెల బియ్యం సరఫరాలో మరింత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయంటూ పౌర సరఫరాల శాఖపై డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన పదేళ్లలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎప్పుడూ చూడలేదంటూ అసహనం వెలిబుచ్చుతున్నారు.
ప్రతి నెలా 1వ తేదీ నుంచి ప్రారంభించి 15వ తేదీ నాటికి లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే సరిపడా బియ్యం అందక పంపిణీని నిర్ణీత గడువులోగా ఎలా పూర్తిచేయాలో అర్థంకాక డీలర్లు సతమతమవుతున్నారు. గత మూడు నెలలుగా బియ్యం లేక గోదాములు నిండుకుంటున్నాయని వాపోతున్నారు. సాధారణంగా ప్రతి నెలా పౌర సరఫరాల శాఖాధికారులు 23వ తేదీ నుంచి నెలాఖరు వరకు గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడ ఉండి రేషన్ డీలర్లకు సరఫరా చేస్తారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ డీలర్లు లబ్ధిదారులు బియ్యం పంపిణీ చేస్తారు. డీలర్ల వద్ద ఉండే ఈ-పాస్ మిషన్లు కూడా 15వ తేదీ సాయంత్రం ఆన్లైన్ ఆఫ్ అయిపోతుంది. అయితే గత నెలలో కూడా 15వ తేదీ వరకు బియ్యం సరఫరా చేయడంతో డీలర్లు నెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేశారు. ఇందుకు ఈ-పాస్ మిషన్లను అధికారులు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో నిరుపేదలకు పంపిణీ చేయడానికి డిసెంబర్ నెలకు మొత్తం 43,638.27 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా కావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 443 రేషన్ దుకాణాల పరిధిలో 2,93,268 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ 21,149, అన్నపూర్ణ 3, ఫుడ్ సెక్యూరిటీ 2,72,116 కార్డులు ఉన్నాయి. వీటికి అవసరమైన 43,638.27 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లకు అందలేదు. ఇప్పటివరకు ఈ నెల కేవలం 3 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అందాయి. వీటితోనే లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. మిగతా బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం ఇతర జిల్లాల నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడానికి దృష్టి సారిస్తూనే మరోవైపు మిల్లర్ల చుట్టూ తిరుగుతూ బతిమిలాడుకుంటున్నారు. గత కేసీఆర్ సర్కార్ హయాంలో ఇటువంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదంటూ అధికారులు, డీలర్లు చెబుతున్నారు.
రేవంత్రెడ్డి సర్కార్ అసమర్ధత, ముందుచూపు లేమి కారణంగానే గోదాములు ఖాళీ అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి వాటిని సీఎంఆర్ కోసం మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించి నిర్దేశిత సమయంలో బియ్యం తీసుకుని గోదాముల్లో నిల్వ చేసింది. ప్రతి నెలా డీలర్లకు నిర్ణీత గడువులోగా బియ్యం సరఫరా చేసి లబ్ధిదారులకు అందించడంలో ఎటువంటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రేషన్ బియ్యం సేకరణ కష్టంగా మారింది. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు మిల్లుల చుట్టూ తిరుగుతున్నారు. బియ్యం కోసం మిల్లర్ల పట్ల కొంత కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇంకెన్ని నెలలు ఉంటుందోనని డీలర్లు ఆందోళన చెందుతున్నారు.
దమ్మపేట జీసీసీ పరిధిలో మొత్తం 50 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం నిల్వలు లేవు. రోజూవారీగా ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యంను డీలర్లకు సరఫరా చేస్తున్నాం. ఇప్పటివరకు 500 మెట్రిక్ టన్నుల బియ్యంకు గాను 200 టన్నులకు పైగా డీలర్లకు అందించాం. మిగతా బియ్యం వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం.
– కె.పాపారావు, జీసీసీ మేనేజర్, దమ్మపేట
ఇతర జిల్లాల్లో హమాలీల సమస్య కారణంగా బియ్యం సకాలంలో అందలేదు. జిల్లాలో ఇప్పటికే 3 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 443 మంది రేషన్ డీలర్లకు సరఫరా చేశాం. స్థానికంగా బియ్యం అందుబాటులో లేక ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. లబ్ధిదారులకు ఎటువంటి సమస్య లేకుండా బియ్యం పంపిణీ చేస్తాం.
– త్రినాథ్, డీఎం, సివిల్ సప్లయీస్, కొత్తగూడెం