ఖమ్మం సిటీ, ఏప్రిల్ 7: ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధానంగా ఆరోగ్యశ్రీ, కొవిడ్, టీబీ నియంత్రణ విభాగంలో ప్రత్యేకతను చాటుకున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా కాయకల్ప అవార్డులను కైవసం చేసుకున్న దవాఖాన తాజాగా రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి మెడికల్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఖమ్మం పెద్దాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావును సత్కరించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆశ కార్యకర్తలు ఉషారాణి, కోటమ్మ, బెస్ట్ డీటీసీవోలుగా వైద్యాధికారులు శ్రీనివాసులు, వరికూటి సుబ్బారావు ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ ఎస్ఎన్సీయూ విభాగంలో ఏరియా దవాఖాన అవార్డు దక్కించుకున్నది.
కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టించిన సంగతి అందరికీ విధితమే. ధనికులు, పేదలు అనే భేదం లేకుండా ఎంతో మంది కొవిడ్ మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారు. వైద్యసేవల్లో నిమగ్నమైన వైద్యులు, ఇతర సిబ్బంది సైతం కన్నుమూశారు. కొవిడ్ అంటేనే హడలిపోతున్న తరుణంలో ఖమ్మంలోని పెద్దాసుపత్రి ప్రజలకు అందించిన సేవలు అనన్య సామాన్యం. కొవిడ్ సమయంలో కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో వైద్యసేవలు అందించింది. వందలాది మంది కొవిడ్ బాధితులను ప్రాణాలను కాపాడింది. వైద్యసిబ్బంది షిప్టుల పద్ధతిలో 24 గంటల పాటు సేవలందించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించారు. ఒకానొక సందర్భంలో టెలీ మెడిసిన్ విధానాన్ని అమలు చేశారు. సేవలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దాసుపత్రికి ఉత్తమ సేవల అవార్డు ప్రదానం చేసింది.
పెద్దాసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆసుపత్రిలో 2016 నుంచి డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నయాపైసా ఖర్చు లేకుండా కిడ్నీ బాధితులు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. తాజాగా హాస్పిటల్లో క్యాథ్లాబ్ విభాగం ఏర్పాటైంది. మరోవైపు క్షయ నివారణలోనూ వైద్యసిబ్బంది ముందంజలో ఉన్నారు. జిల్లాలో ఏర్పాటైన టీబీ క్లబ్స్ ఆస్పత్రికి మంచి పేరు తీసుకువచ్చాయి.