‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశతో వెనుతిరిగిపోతున్న దయనీయ స్థితి. రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగు చేసిన పంటలు నోటికాడికొచ్చాయని, ఈ సమయంలో యూరియా అందించకపోతే భారీనష్టమే వస్తుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి రాకపోతే అప్పులు ఎలా తీరుతాయని మనోవేదన చెందుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న అన్నదాతలను నట్టేటముంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.’
వైరా టౌన్, సెప్టెంబర్ 12: ఆగస్టు 13, 14, 16 తేదీల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్సులు యూరియా కోసం సీరియల్లో పెట్టి నెలరోజులవుతున్నా యూరియా తమకు అందలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైరాలోని యూరియా పంపిణీ కేంద్రంలో పెద్దసంఖ్యలో రైతులు నిరసన తెలిపారు. శుక్రవారం కేవలం 445 యూరియా బస్తాలు పంపిణీకి అందుబాటులో ఉండటంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు.
డివిజన్ వ్యవసాయాధికారి కరుణ, మండల వ్యవసాయాధికారి మయాన్ మంజుఖాన్, వైరా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి.రామారావు యూరియా పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని ఇప్పటివరకు సీరియల్లో ఉన్న రైతులందరికీ రెండ్రోజుల్లో యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతులు యూరియా కోసం తీవ్ర తాపత్రయ పడుతున్నారని అన్నారు. సరిపోయే యూరియా అందించకపోతే పెద్దఎత్తున రైతులు పోరాటం చేస్తారని హెచ్చరించారు.
ఇల్లెందు, సెప్టెంబర్ 12: ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ ఎరువుల గోడౌన్ వద్దకు శుక్రవారం రైతులు యూరియా కోసం భారీ సంఖ్యలో చేరారు. తెల్లవారుజామునే అక్కడకు చేరుకొని క్యూలైన్లో నిల్చున్నారు. ఉదయం 9 గంటల తర్వాత విసుగుచెంది చెప్పులను లైన్లో పెట్టి పక్కన కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ పనులు మానుకొని యూరియా కోసం ఇంకా ఎన్నాళ్లు తిరగాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తల్లాడ, సెప్టెంబర్ 12: యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న రైతులు మండల పరిధిలోని అన్నారుగూడెం రైతువేదిక, గంగదేవిపాడు సొసైటీ వద్దకు శుక్రవారం పెద్దసంఖ్యలో చేరుకొని క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే నిరీక్షించగా అధికారులు మాత్రం రైతులకు ఉదయం టోకెన్లు అందించి సాయంత్రం యూరియా పంపిణీ చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పెనుబల్లి, సెప్టెంబర్ 12: పెనుబల్లి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే ఎదురుచూశారు. యూరియా కోసం ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రైతులు సొసైటీ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో తెల్లవారుజామునే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వ్యవసాయ అధికారులు వరుస క్రమంలో ఒక్కో రైతుకు ఒక్కో కట్ట చొప్పున అందించారు. యూరియా కట్టలు రానివారు నిరాశగా వెనుతిరిగారు.