పెనుబల్లి, ఏప్రిల్ 24: తెలంగాణ అభివృద్ధిని గుర్తించి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అవార్డుల మీద అవార్డులు ఇస్తూ ప్రశంసిస్తుంటే.. అదే పార్టీ నాయకులు తెలంగాణ గల్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వాళ్లలో వారికే క్లారిటీ లేదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రూ.7.50 కోట్లతో చేపట్టిన పెనుబల్లిలో 30 బెడ్ల వైద్యశాల నిర్మాణానికి మంత్రి అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఇదే జిల్లాలో ఎందరో గొప్పగొప్ప కాంగ్రెస్ నాయకులు పనిచేసినప్పటికీ ఒక్కరు కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ రాక ముందు 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే తెలంగాణ వచ్చాక 20 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వివరించారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి గృహలక్ష్మి రాబోతోందని, అది మహిళ పేరునే ఉండబోతోందని అన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలో మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్ల తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కు 10 స్థానాలు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఖమ్మం మెడికల్ కళాశాల మంజూరుపత్రాన్ని మంత్రి అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుకు మంత్రి హరీశ్‌రావు అందించారు. ఈ సందర్భంగా వారు మంత్రి హరీశ్‌ను సత్కరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు లింగాల కమలరాజు, రాయల వెంకటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, నల్లమల వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, చింతనిప్పు కృష్ణచైతన్య, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్‌రావు, డాక్టర్ రమేశ్, కనగాల వెంకట్రావు, మందడపు అశోక్‌కుమార్, చింతనిప్పు సత్యనారాయణ, పసుమర్తి వెంకటేశ్వరరావు, చెక్కిలాల లక్ష్మణరావు, కోటగిరి సుధాకర్‌బాబు, తేజావత్ తావునాయక్, భుక్యా పంతులి, చీపు లక్ష్మీకాంతం, వంగా ఝాన్సీ, భుక్యా ప్రసాద్, నిరంజన్‌గౌడ్ పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలు
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతుందని అన్నారు. కల్లూరులో ప్రభుత్వ వైద్యశాల నూతన భవన నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. కల్లూరులో కూలిపోయే దశలో ఉన్న భవనంలో ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తన దృష్టికి తీసుకొచ్చారని, ఆరు నెలల క్రితం తాను ఇక్కడి పర్యటనకు వచ్చినప్పుడు తనను ఆసుపత్రిలోకి తీసుకెళ్లి పరిస్థితిని చూపించారని అన్నారు. తాను కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించానని అన్నారు. దీంతో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.50 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఈ నిధులతోనే భవనాన్ని నిర్మించుకునేందుకు శంకుస్థాపన చేసుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వ పాలనలో 20 ఏళ్లకు ఒక వై ద్యశాలను ఇచ్చారని, ప్రస్తుతం కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ అన్ని రాష్ర్టాలకు వైద్యశాలలకు ఇచ్చినా తెలంగాణకు ఒక వైద్యశాలకు కేటాయించలేదని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. దీంతో రాష్ట్ర నిధులతో సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా నూతన మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, వైద్యశాలలను నిర్మిస్తున్నారని అన్నారు. మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు 17 మెడికల్ కళాశాలలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించారని అన్నారు. సత్తుపల్లికి వంద బెడ్ల ఆసుపత్రి, కల్లూరుకు 50 బెడ్ల ఆసుపత్రి, పెనుబల్లికి 50 బెడ్ల ఆసుపత్రి మంజూరు చేసి మొత్తం రూ.110 కోట్ల నిధులు అందించినందుకు ఈ సభావేదిక నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. అనంతరం కల్లూరు ఎన్నెస్పీ కార్యాలయ ఆవరణలో రూ.1.99 కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ సీఈ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు రాయల వెంకటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కలెక్టర్ గౌతమ్, డీసీహెచ్ వో వెంకటేశ్వర్లు, ఎన్నెస్పీ సీఈ శంకర్‌నాయక్, ఈఈ లక్ష్మీనారాయణ, ఎస్ఈ ఉప్పలనాయుడు, నాయకులు బీరవల్లి రఘు, అజయ్‌బాబు, రామారావు, నీరజ, చంద్రరావు, రఘు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ప్రసాద్ పాల్గొన్నారు.