ఖమ్మం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. అధికారులు 17 విభాగాల్లో 262 రకాల పనులు గుర్తించనున్నారు. పనులపై గ్రామ, వార్డుసభలు నిర్వహించి బడ్జెట్ అంచనాలను రూపొందిస్తారు. అనంతరం గ్రామసభలో గ్రామస్తులతో బడ్జెట్‌ను ఆమోదింపజేయనున్నారు. సామాజిక తనిఖీలకు స్వయం సహాయక సంఘాల నుంచి ముగ్గురు మహిళలను రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. వ్యవసాయ పరమైన, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి వార్షిక ప్రణాళిక అమలు కానున్నది.
ప్రాధాన్య క్రమంలో పనుల గుర్తింపు..
ఉపాధి పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సర లేబర్ బడ్జెట్‌కు కార్యాచరణ రూపొందించాం. ఇప్పటికే ఒక విడత గ్రామసభల నిర్వహణ పూర్తయింది. ఈసారి ఉపాధి పనుల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామంలో ప్రాధాన్య క్రమంలో పనుల గుర్తింపు ప్రక్రియ చేపడతాం.
– విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం