మంథని, మే 14: స్థానిక కాంగ్రెస్ మంత్రి మంథని ప్రాంత అభివృద్ధిని మరిచి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. నియోజకవర్గ ప్రగతిపై సమీక్షలు చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపై రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేయాలి? ఇకడ ఉన్న సంపదను ఎలా తరలించాలి? అనే ఆలోచన మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గుర్తించి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆపార్టీకి బుద్ధి చెప్పేలా బీఆర్ఎస్కు ఓటు ద్వారా మద్దతు తెలిపారని చెప్పారు.
పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంథనిలోని రాజగృహలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు 35ఎంఎం ట్రయల్ మాత్రమే చూశారని, మున్ముందు 70ఎంఎం సినిమా చూపిస్తానని’ మాట్లాడడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా చిన్న కాళేశ్వరం పూర్తి చేసేందుకు నిధులు, తాడిచర్ల-భూపాలపల్లి రోడ్డు నిర్మాణం కోసం నిధులు తేవాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టి ఉంటే ఓడేడు వంతెన కూలి పోయేది కాదన్నారు. మంథని నుంచి మొదలు మహదేవపూర్ దాకా ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని, ఎకడ చూసినా ఇసుక డంపులే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇకడ మంథని ఎమ్మెల్యే ఒకటేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎంపీ ఎన్నికల సమయంలో రాజ్యాంగం మారుస్తారని విష ప్రచారం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పేలా రాజ్యాంగంపై అవగాహన కల్పించే బాధ్యత తామే తీసుకుంటున్నామని వివరించారు. భయానికో.. ప్రలోభాలకో, పదవుల కోసం పార్టీ మారిన వారి ఇంట్లో సైతం రూ.4వేల పెన్షన్ రావాలన్నా, రైతు బంధు రావాలన్నా, ఇతర పథకాలు రావాలన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పోరాటం చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తమ పార్టీలో పది మంది ఉన్నా పట్టువదలకుండా ప్రజా సమస్యల పరిష్కారం, ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా పోరాటం చేస్తామన్నారు.