Rasamayi Balakishan | గన్నేరువరం, జూన్30: ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలంలోని గుండ్లపల్లి లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమీషన్ లు తీసుకోవడం తప్ప గడుస్తున్న 18నెలల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అవినీతి పరాకాష్టతోనేదగ్గరకు వచ్చిన మంత్రి దూరమైందన్నారు.
మండలానికి కాలేశ్వరం జలాలను తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకు మొండి చేయి చూపుతున్నారని మండిపడ్డారు. మండలంలోని ప్రజాపాలనలో 2561 మందిని గుర్తించి కేవలం 161మందికి ఇవ్వడం సరికాదన్నారు. ఎంపిక చేసిన వారిలో ఎంతమంది నిరుపేదలు, అర్హులు ఉన్నారో చెప్పే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. డబుల్ రోడ్డు పనులు ప్రారంభించకుంటే ప్రజలతో పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ వైస్ చైర్పర్సన్ సిద్ధం వేణు, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న, మహిళా అధ్యక్షురాలు కుసుంబా నవీన, బీఆర్ఎస్ నాయకులు గుడెల్లి ఆంజనేయులు, బద్దం తిరుపతి రెడ్డి, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.