Kanumalla Vijaya | చిగురుమామిడి, జనవరి 16 : యువత ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జరిగింది. కాగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గంజాయి, మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని యువతకు సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యువత క్రీడలతో పాటు వ్యాయామం చేయాలన్నారు. మద్యం వద్దు మైదానం ముద్దు నినాదంతో టోర్నమెంటును నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు, టోర్నమెంట్ నిర్వాహకులు జేరిపోతుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, చిగురుమామిడి సర్పంచ్ అకవరం భవాని, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ ఎంపీటీసీ, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేష్, బిఆర్ఎస్ మండల నాయకులు బెజ్జంకి రాంబాబు, ఉప సర్పంచ్లు కానవేణి జితేందర్, కాసర్ల హరీష్, వార్డు సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.