Korutla | కోరుట్ల, ఆగస్టు 13: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కార్గిల్ చౌక్ జాతీయ రహదారి పై నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్నాయన్నారు.
25 ఏళ్లలోపు యువతే అధికంగా మత్తుకు బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం యువతీ యువకులు, పట్టణ ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై సీఐ అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.