SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజీవ్ యువ వికాసం పై బ్యాంకర్ల తో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం క్రింద మంజూరు చేసే యూనిట్ లకు మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్ లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన, తుది ఆమోదం సమయంలో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సైతం హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.
స్క్రినింగ్ కమిటీ సమావేశాల్లో హాజరు కావాలని, మండల స్థాయి అధికారులతో సమన్వయంలో ఉంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతం చేయాలని అన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ పథకం కింద ఓబిఎంఎస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్ ల పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షల లోపు) మొదలైనవి అవసరమని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సరి చూసుకుని దరఖాస్తుల స్క్రూటినీ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, యు.బి.ఐ బ్యాంక్ రీజినల్ హెడ్ అపర్ణ రెడ్డి, ఎస్.బి.ఐ. రీజినల్ మేనేజర్ వెంకటేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, వివిధ బ్యాంకు కంట్రోలర్స్ , బ్యాంకు మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.