social media | ధర్మారం,సెప్టెంబర్ 8: ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చెనెల్లి హరీష్ చంపుతామని హెచ్చరించగా, అదే గ్రామంలో నిన్న రాత్రి హరీష్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను చంపుతామని ప్రయత్నించిన సంఘటనలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతిపై వారు ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరీష్ తో పాటు అతని తల్లి పోలీస్ స్టేషన్ వచ్చి స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ కు వేర్వేరుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
హరీష్ కుటుంబంపై యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి చేసిన దౌర్జన్యంపై పార్టీ మండల నాయకులు సంఘీభావం తెలిపి హరీష్ కు అండగా నిలిచారు. బాధితులతో కలిసి వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం బాధితులు హరీష్ తల్లితోపాటు పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. హరీష్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు పత్రాన్ని విలేకరులకు అందజేశారు. తాను వృత్తి రీత్యా హైదరాబాదులో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు హరీష్ పేర్కొన్నారు.
ఆదివారం కాంగ్రెస్ యూత్ మండలాధ్యక్షుడు తిరుపతి ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడున్నావు మీ ఇంటికి వస్తున్న చంపుతానని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించినట్లు హరీష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గం, ప్రజలే నా ప్రాణం అనే వాట్సప్ గ్రూపులో అసభ్య పదజాలంతో తిరుపతి గ్రూప్ లో పోస్టులు పెట్టాడు. తనకు మంత్రి లక్ష్మణ్ కుమార్ అండదండలు ఉన్నాయని, అవసరమైతే నీ మీద రౌడీషీట్ ఓపెన్ చేయిస్తానని తిరుపతి బెదిరించినట్లు హరీష్ వాపోయాడు. తనకు తిరుపతి తో ప్రాణ హాని ఉందని లిఖిత పూర్వకంగా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.
ఇంటికి వచ్చి మాపై దాడికి ప్రయత్నం చేసిన తిరుపతి : పోలీసులకు ఫిర్యాదు చేసిన హరీష్ తల్లి
ధర్మారం మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు తిరుపతి తమ కుమారుడు హరీష్ ను చంపుతామని బెదిరిస్తూ ఆదివారం రాత్రి తమ స్వగ్రామం నంది మేడారానికి వచ్చి భయభ్రాంతులకు గురి చేసినట్లు హరీష్ తల్లి చెనెల్లి రాజమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రి సమయంలో తిరుపతి తమ ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించి వృద్ధులమైన హరీష్ తల్లిదండ్రుల మైన తమపై అతడు దాడికి ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. మీ కొడుకు ఎక్కడున్నాడో ఇంటికి రప్పించు హరీష్ తో పాటు మిమ్మల్ని కలిపి చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు హరీష్ కు యూత్ కాంగ్రెస్ నాయకుడు తిరుపతి తో ప్రాణహాని ఉందని అతనిపై చట్టరితే చర్య తీసుకోవాలని హరీష్ తల్లి ఎస్సై కి విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించడం దారుణం : రాచూరి శ్రీధర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త చెనెల్లి హరీష్ ప్రశ్నిస్తే రీ యూత్ కాంగ్రెస్ నాయకుడు సోగాల తిరుపతి చంపుతామని బెదిరించడం సరైంది కాదని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ పేర్కొన్నారు. తిరుపతి చంపుతామని బెదిరించిన సంఘటనపై నంది మేడారం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త చెనెల్లి హరీష్, అతని తల్లి రాజమ్మ యూత్ కాంగ్రెస్ నాయకుడు తిరుపతిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో చేసిన సంక్షేమ పథకాలను హరీష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు ప్రజా సమస్యలపై, యూరియా కొరతపై హరీష్ ప్రశ్నించగా అతని పోస్టులపై తిరుపతి ప్రతిస్పందించి ఇష్టానుసారంగా గ్రూపుల్లో పోస్టులు పెట్టడం సరైనది కాదని శ్రీధర్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గం, ప్రజలే నా ప్రాణం సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో హరీష్ పై తిరుపతి ఇష్టానుసారంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టి బెదిరించాడని ఆయన ఆరోపించారు. హరీష్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు చేయడంతో పాటు తనకు మంత్రి లక్ష్మణ్ కుమార్ అండ ఉందని తిరుపతి బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. హరీష్ ను సోషల్ మీడియా వేదికగా బెదిరించడంతోపాటు ఫోన్లో చంపుతామని తిరుపతి బెదిరించి తర్వాత రాత్రి నంది మేడారం అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరించడం దారుణమని ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదని తాము కేసీఆర్ వారసులమని, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సైనికులమని శ్రీధర్ స్పష్టం చేశారు. హరీష్ కు న్యాయం జరిగే వరకూ పార్టీ పరంగా తాము అతనికి అండగా ఉంటామని ఆయన వివరించారు. హరీష్ కు వారం రోజుల్లో చట్టపరంగా న్యాయం జరగకుంటే పార్టీ పరంగా న్యాయపోరాటం చేయడానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని శ్రీధర్ సందర్భంగా మీడియాతో మాట్లాడి వివరించారు. శ్రీధర్ వెంట ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ మాజీ జిల్లా సభ్యుడు రామారావు, మేడారం పాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట తిరుపతి, పార్టీ నాయకులు పెంచాల రాజేశం, తుమ్మల రాంబాబు, కాంపల్లి చంద్రశేఖర్, దేవి రమణ, ఎగ్గేలా స్వామి, ఐత వెంకటస్వామి, ఆవుల శ్రీనివాస్, దేవీ వంశీకృష్ణ, బొడ్డు రామన్న, కారుపాకల రాజయ్య, నాడెం శ్రీనివాస్, దోనికేని తిరుపతి గౌడ్, నేరెళ్ళ చిన్న లచ్చన్న, సంధినేని కొమురయ్య, పంజాల శ్రీనివాస్, అజ్మీరా మల్లేష్ నాయక్, ఆవుల వేణుగోపాల్, దేవి రాజేందర్, గంధం తిరుపతి, రత్తిలాల్ నాయక్, బొంతల నర్సింగం, బొడ్డు రమేష్, బొడ్డు నర్సయ్య, తదితరులు ఉన్నారు.