కోనరావుపేట, జనవరి 12: గుండె నొప్పిగా ఉందని ఆర్ఎంపీ వద్దకు వెళ్తూ ఓ యువకుడు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. దారి మధ్యలో కలిసిన ఫ్రెండ్స్‌తో సరదాగా ముచ్చటిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే చనిపోగా, గ్రామంలో విషాదం నెలకొన్నది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్కం రాజు (33) ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్తుంటాడు.
భార్య లహరి, కూతుళ్లు శ్రీనిత్య (5), ఇన్సిక (2)ను గ్రామంలో ఉంచాడు. అక్కడ కూలి పనులు చేస్తూ.. రెండు మూడు నెలలకోసారి వస్తున్నాడు. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా గడపడానికి వారం క్రితం ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఇంట్లో పిల్లలతో సంతోషంగా గడిపాడు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో తల్లడిల్లిపోయాడు. మంచినీళ్లు తాగి రిలాక్స్ అయ్యాడు. తర్వాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్ఎంపీకి చూపెట్టుకుంటానని బామ్మర్దితో కలిసి నడుచుకుంటూ వెళ్లాడు. దారి మధ్యలో బస్టాండ్ వద్ద ఉన్న తన స్నేహితులకు తనకు గుండెపోటు విషయం చెప్పి, ముచ్చటిస్తున్నాడు.
అంతలోనే నొప్పి తీవ్రం కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడకు ఆర్ఎంపీ చేరుకొని పరీక్షించి, సిరిసిల్ల దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పాడు. ఆ వెంటే ప్రైవేట్ వాహనంలో అక్కడకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో కుటుంసభ్యులు ఒక్కసారిగా బోరుమన్నారు. ఇంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్లి విగతజీవిగా వచ్చావా అంటూ గుండెలవిసేలా విలపించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత కోరారు.