Reddypally | వీణవంక, అక్టోబర్ 30 : రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేష్ కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య, పిల్లలు అతడిని వదిలేసి వారి అమ్మగారింటికి వెళ్లారు.
అప్పటి నుండి ఇంటి, ఊరి వారితో తాగి గొడవపెట్టుకునేవాడు. ఈ నెల 28న రాత్రి 9 గంటలకు నరేష్ మద్యం బాగా సేవించి అతడి సోదరుడు సురేష్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. కాగా సురేష్, నరేష్ వద్దకు వెళ్లి ఎందుకు తిడుతున్నావని నెట్టివేయగా నరేష్ బండపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందినట్లు చెందాడు. మృతుడి తండ్రి సుకాసి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.