శంకరపట్నం : ఆన్లైన్ గేమ్స్‌కు(Online games) బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఈడిగ మధు (33) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై దాదాపు రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈనెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య గీత, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మృతుడు ఆరు నెలల క్రితం కూడా బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
జీవితం విరక్తితో వృద్ధుడు..
శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామంలో వృద్ధాప్య జీవితం పట్ల విరక్తితో ముప్పిడి రామిరెడ్డి (72) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామిరెడ్డి భార్య 40 ఏండ్ల క్రితం మృతి చెందింది. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామానికి చెందిన రాంరెడ్డి నాలుగేళ్లుగా రేకుర్తిలోని తన బావమరిది తుమ్మల పురుషోత్తం రెడ్డి ఇంట్లో ఉంటున్నాడు. 15 రోజుల క్రితం రాంరెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
అదే రోజు పురుషోత్తం రెడ్డి స్వగ్రామం మెట్‌పల్లికి వచ్చాడు. శనివారం రాత్రి ఓ వీధిలో పురుగుమందు పురుగుల మందు తాగి మృతి చెందగా, గ్రామస్తులు పురుషోత్తం రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వృద్ధాప్యంలో తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులు ఎవరు తోడు లేకపోవడంతో.. ఆత్మహత్య చేసుకున్నట్లు పురుషోత్తం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.