Peddapally | పెద్దపల్లి, మే29: యువ ఇంజినీర్ వ్యవసాయపై మక్కువతో సాగు బాట పట్టాడు. హైదరాబాద్‌లోని డీఆర్డీవోలో ఏఎస్ఎల్ ఏజెన్సీ తరఫున మిసైల్స్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పదేళ్లు పాటు ఇంజినీర్‌గా పని చేశాడు. ఐదేండ్ల క్రితం వ్యవసాయం మీద మక్కువతో నెలకు రూ.లక్ష దాకా వచ్చే జీతాన్ని వదులుకొని సాగు బాటు పట్టాడు. వినూత్న ఆలోచనతో లాభాదాయకమైన వాణిజ్య పంటలు పండిస్తూ, పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తన కున్న 12 ఎకరాల్లో లాభాదాయక వాణిజ్య పంటలైన డ్రాగెన్ ఫ్రూట్, జామ, మామిడి, కొబ్బరి, ఆయిల్ పాం, ఖర్జూర తోట వేసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు పెద్దపల్లి శ్రావణ్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఉత్తర తెలంగాణలోనే మొదటి సారిగా..
సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో ఖర్జూర తోటలు కన్పిస్తాయి. మూడేళ్ల క్రితం ఉత్తర తెలంగాణలో మొదటి సారిగా బర్హీ రకం 200 ఆడ ఖర్జూర, 25 మగ ఖర్జూర మొక్కలు దుబాయ్ నుంచి తీప్పించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో 4 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బర్హీ రకం ఖర్జూర తోట పెట్టాడు. ఆడచెట్టు నుంచి మాత్రమే ఫలాలు వస్తాయి. ఒక మగచెట్టు నుంచి వచ్చే పరాగరేణువులు సుమారు 50 ఆడచెట్లను ఫలవంతం చేస్తాయి. సాధారణంగా 5 -8 ఏళ్ల మధ్య ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. కానీ శ్రావణ్ పెట్టిన ఖర్జూర తోటలో కొన్ని మొక్కలు మూడేళ్లకే కాపు వచ్చాయి. ఉత్తర తెలంగాణలో తొలి సారిగా ఖర్జూరం పండిందని శ్రావణ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఖర్జూర పండ్లలోని తేమ ఆధారంగా మూడు రకాలు ఉంటాయి. అందులో మెత్తనివి, కాస్త ఎండినవి, పూర్తిగా ఎండినవని. మొదటి రకంలో తేమ ఎక్కువ, తీపి తక్కువ, రెండో రకంలో తేమ తక్కువ తీపి ఎక్కువ, మూడో రకంలో తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు అనేక రకాలుంటాయి. గుండ్రంగా, మృదువుగా తియ్యగా ఉండే బార్హీ రకం ఖర్జూరం.
పది మందికి ఉపాధి కల్పించాలని.. : పెద్దపల్లి శ్రావణ్, యువరైతు
ఎంటెక్ (ఈఎస్) పూర్తి చేసి హైదరాబాద్‌లోని డీఆర్డీవోలో ఏఎస్ఎల్ ఎజేన్సీ తరుపున మిసైల్స్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పదేళ్లు పాటు ఇంజినీర్ పని చేశాను. నెలకు లక్ష రూపాయల జీతం వదులుకోని నాతో పాటు పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సాగు బాట పట్టా. మాకున్న 12 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు పండిస్తున్నాను. ఎడారి ప్రాంతంలో పండించే ఖర్జూరం తోటను ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకోని దుబాయ్ నుంచి ఒక్కో మొక్కకు రూ.5వేలు వెచ్చించి(టిష్యూ కల్చర్ ప్లాంట్) 200 ఆడ, 25 మగ ఖర్జూర మొక్కలను తెప్పించాను.
నాలుగు ఎకరాల్లో పెట్టిన. సాధారణంగా ఐదేండ్ల తర్వాత కాతకు వస్తాయి. కానీ మా తోటలోని 20 చెట్లు మూడేళ్లకే కాతకు వచ్చాయి. చూట్టు ప్రక్కల గ్రామాల రైతులు, వ్యవసాయాధికారులు సందర్శిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఒక్కో చెట్టు నుంచి దాదాపు 200 కేజీ దిగుబడి వస్తుంది. మార్కెట్లో కేజీకి రూ.200 దాకా ఉంటుంది. ఒక్కో చెట్టు నుంచి ఏడాదికి రూ.40వేల దాకా ఆదాయం రావచ్చు. మరో రెండేళ్ల తర్వాత 200 చెట్లు ద్వారా ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం వచ్చే అవకాశం లేకపోలేదు. ఖర్జూర తోట నిర్వాహణ కోసం పది మందికి కూలీలకు ఏడాది పొడువున ఉపాధి కల్పిస్తున్న.