తిమ్మాపూర్, ఆగస్టు 31 : యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని రాత్రీ పగలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఈ చిత్రం! సోమవారం ఉదయం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో యూరియా పంపిణీ చేసేందుకు ఆదివారం సాయంత్రం గోదాంకు 450 బస్తాలతో లారీ లోడ్ వచ్చింది. ఈ విషయం గ్రామ రైతులకు తెలిసింది. ఒక్కొక్కరుగా రాత్రి 7గంటల వరకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
సుమారు వంద మందికిపైగా తరలివచ్చారు. సిబ్బంది రేపు పంపిణీ చేస్తామని చెప్పినా.. వెళ్లిపోతే యూరియా దొరుకుందో.. దొరకదోనని అక్కడే పడిగాపులు గాశారు. క్యూలో ఉండే ఓపిక చెప్పులను లైన్లో పెట్టారు. కొందరు వెళ్లిపోగా, మరికొందరు తినడానికి ఇండ్లకు వెళ్లి వచ్చారు. ఇంకొందరు ఏకంగా దుప్పట్లు తెచ్చుకొని అక్కడే పడుకున్నారు. రాత్రి 11 గంటల తర్వాత కూడా పెద్ద సంఖ్యలో రైతులు కనిపించారు. అన్నతాతలను గోస పెట్టవవ్దని, సాగుకు సరిపడా యూరియా అందజేయాలని వేడుకుంటున్నారు.