Yoga | జగిత్యాల, జూన్ 21 : భారతదేశం ప్రపంచ మానవాళికి అందించిన గొప్ప వరం యోగ అని ప్రముఖ వైద్యులు, ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వాల్మీకి ఆవాసం సేవా భారతీ ఆధ్వర్యంలో స్థానిక గీత విద్యాలయం మైదానంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 దేశాలలో యోగ కార్యక్రమాలు జరుగుతున్నా యన్నారు.
యోగ సాధన వల్ల శారీరక, మానసిక ఒత్తిడి దూరమై మనిషి ఆరోగ్యకరంగా జీవించగలుగుతారని తెలిపారు. యోగ సాధనలో శ్వాసను నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకు పెరుగుతుందని దీనికి యోగ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన గొప్ప ఆరోగ్య కరదీపిక యోగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగను భాగస్వామి గా చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యోగ శిక్షకులు డాక్టర్ గుండేటి ధనుంజయ, గడ్డం పూర్ణిమ, ఆవాస కమిటీ సభ్యులు ఎన్నమనేని అశోకరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, తుంగూరి సురేష్, మల్లేశం, బిజెపి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు దివాకర్, రాగిళ్ల సత్యనారాయణ, శంకర్, గాధాసు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.