
Idulapur | కాల్వ శ్రీరాంపూర్, జనవరి 28 : అనారోగ్యం బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో వారి కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇదులాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కూలి అక్కల సదయ్య-శ్యామల దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కాగా సదయ్య ఇదే గ్రామంలో బర్రెల కాపరిగా పనిచేస్తుండగా భార్య శ్యామల కూలి పని చేసేది. 2022లో తీవ్ర అనారోగ్యానికి గురైన శ్యామల అనారోగ్యం బారిన పడి మృతి చెందింది.
అప్పటినుండి కుమార్తెలను సదయ్య పోషించేవాడు. భార్యపై మనోవేదనతో పాటు కుటుంబాన్ని ఎలా పోషించాలని నిత్యం బాధపడుతుండేవాడు. అయితే గత నెల రోజుల క్రితం సదయ్య కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కాగా కుమార్తెలతో పాటు బంధువులు పలు దావఖానలల్లో చికిత్స చేయించారు. అయినా రోగం నయం కాకపోవడంతో పాటు పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కాగా సదయ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి వద్ద చిల్లి గవ్వలేకపోవడంతో గ్రామస్తులు స్పందించి విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. సదయ్య మృతితో కూతుర్లు అనాథలయ్యారు. దాతలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.