సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన గురువులు అడ్డదారులు తొక్కుతున్నారు. పన్ను మినహాయింపుల కోసం పక్కదారి పడుతున్నారు. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా ఒకే అకౌంట్ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు లోన్లు తీసుకున్న విషయం వెలుగులోకి రాగా.. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయిపు కోసం లేని ఇంటి నంబర్లను సృష్టిస్తున్నారు. అలాగే అద్దెకు ఉంటున్నట్టు, నెలనెలా కిరాయి చెల్లిస్తున్నట్టు రసీదులు తయారు చేస్తున్నారు. సంబంధం లేని పాన్ కార్డులను సమర్పిస్తున్నారు. ఒకరిద్దరు కాదు, వందలాది మంది గురువులు ఇదే బాటలో వెళ్తున్నట్టు ఆధారాలతో బయట పడుతుండగా.. అందుకు విద్యాశాఖ మొద్దునిద్రే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది టీచర్లు తొక్కుతున్న అడ్డదారులు ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చి పెడుతుండగా.. గురువులతోపాటు వివిధ విభాగాల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఇదే దారుల్లో వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : నిజానికి చిన్నారులు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పి, వారిని క్రమశిక్షణలో పెట్టి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన గురువులే, ఆదాయ పన్ను మినహాయింపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఒకే లోన్ అకౌంట్‌పై రుణాలు తీసుకున్నట్టు.. అదే అకౌంట్‌కు వాయిదాలు చెల్లిస్తున్నట్టు బోగస్ రికార్డులు సృష్టించిన తీరును ‘ఒకే అకౌంట్‌పై ముగ్గురు పంతుళ్లకు లోన్లు?’ శీర్షికన ఈనెల 24న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురించింది. ఈ బాగోతం విద్యాశాఖలో కలకలం సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.
అంతేకాదు, సదరు అకౌంట్‌దారుల పూర్తి వివరాలతో కూడిన బోగస్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. ఆ మేరకు సదరు ఆదాయపన్ను అధికారులు పూర్తి స్థాయి విచారణకు సిద్ధమవుతున్నట్టు అత్యంత విశ్వాసనీయ సమాచారం కాగా, ఈ విషయంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ఐటీ మినహాయింపు కోసం కొంత మంది టీచర్ల వెళ్తున్న అడ్డదారి ఉపాధ్యాయ లోకానికి మచ్చ తెచ్చిపెడుతున్నది. నిబంధనల ప్రకారం.. ఉపాధ్యాయ, ఉద్యోగుల సౌకర్యార్థం బేసిక్ వేతనంపై ఇంటి అద్దె భత్యం ఉంటుంది.
ఉదాహరణకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాను తీసుకుంటే.. కరీంనగర్, రామగుండం నగర పాలక సంస్థ ప్రాంతాల్లో బేసిక్ వేతనంపై 17 శాతం ఇంటి అద్దె ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ ప్రాంతాల పరిధిలో 8 కిలోమీటర్ల వరకు ఇదే భత్యం వర్తిస్తుంది. అలాగే సిరిసిల్ల, జగిత్యాల వంటి ప్రాంతాల్లో 13 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 11 శాతం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 24 శాతం వరకు చెల్లింపులు ఉంటాయి. ఐటీ మినహాయింపులకు వచ్చే సరికి.. మూడు రకాలుగా లెక్కలు కట్టి, అందులో ఏదీ తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే మినహాయింపు చేజారి పోకుండా ఉండడంతోపాటు ఆదాయ పన్ను మినహాయింపు కోసం పలువురు ఉపాధ్యాయులు పక్కదారుల్లో వెళ్తుండడం కనిస్తున్నది.
ఆదాయ పన్ను మినహాయింపుల కోసం పలువురు టీచర్లు సమర్పించిన రసీదులు, ఇంటినంబర్లు, పాన్‌కార్డులను పరిశీలిస్తే కళ్లుబైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నిజానికి మెజార్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇదే దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. సొంతింట్లోనే ఉంటూ అద్దింట్లో ఉన్నట్టు చూపుతున్నారు. అందులోనూ ఏదో ఒక ఇంటి నంబర్ వేసి, సదరు యజమానికి నెలానెలా ఇంటి అద్దె చెల్లిస్తున్నట్టు బోగస్ రసీదులు సమర్పిస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్ మండలంలోని ఒక స్కూల్ కాంప్లెక్సులో జరిగిన డబ్బుల దుర్వినియోగం విషయంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి జరిపిన విచారణలో అనేక అక్రమాలు బహిర్గతమవుతున్నాయి. ప్రధానంగా మండలంలో పనిచేసే కొంత మంది టీచర్లు నిజాయితీగా పన్ను చెల్లింపులు చేస్తే.. మెజార్టీ ఉపాధ్యాయులు మాత్రం తప్పుడు అంటే పూర్తి బోగస్ పత్రాలు సమర్పించి పన్ను మినహాయింపు పొందుతున్నట్టు బయట పడుతున్నది. సదరు ఉపాధ్యాయలు అద్దింట్లో ఉంటున్నట్టు సమర్పించిన ఇంటినంబర్ల ఆధారంగా కార్పొరేషన్ రికార్డుల్లో తనిఖీ చేస్తే.. సమర్పించిన ప్రతి రికార్డు, ప్రతి పత్రం బోగస్ అని నిర్ధారణ అవుతున్నది. అసలు ఇంటి నంబర్లకు, యజమానుల పేర్లుకు ఏమాత్రం సంబంధం ఉండడం లేదు. మరో విచిత్రం ఏమిటంటే కొంత మంది పంతుళ్లు అసలు లేని ఇంటి నంబర్లను, ఓనర్లను సృష్టించి, వారికి అద్దె చెల్లిస్తున్నట్టు రసీదులను పన్ను మినహాయింపు కోసం సమర్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మాత్రం మొద్దునిద్ర పోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఏమైనా స్పందిస్తుందా.. లేదా చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులు కరీంనగర్ కోతిరాంపూర్‌లో 8-6-110/1/జీ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టు చూపి, ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయింపును క్లెయిమ్ చేస్తూ సర్టిఫికెట్లు సమర్పించారు. అందులో ఒక ఉపాధ్యాయురాలు సమర్పించిన అద్దె రసీదు ప్రకారం ఇంటి యజమాని పేరు తాండవరం అమర్ కుమార్, మరో ఉపాధ్యాయుడు సమర్పించిన రసీదు ప్రకారం అదే ఇంటి యజమాని శ్రీమతి జాప భాగ్యమ్మ! అంతే కాదు, ఇద్దరు వేర్వేరు రకాల పాన్ కార్డులు సమర్పించారు. నిజానికి కార్పొరేషన్ రికార్డుల ప్రకారం చూస్తే ఇంటి యజమాని పేరు చీ రాజేశ్వరి, అలకాపురి అని ఉన్నది.
మరో ఉపాధ్యాయుడు కరీంనగర్‌లోని కట్టరాంపూర్లోని ఇంటి నంబర్ 8-1-267లో నివసిస్తున్నట్టు చూపి, ఇంటి అద్దె రసీదును ఐటీ మినహాయింపు కోసం సమర్పించాడు. యజమాని పేరు బాలసంకుల అహల్యగా చూపాడు. ఇదే టీచర్ మరొక సందర్భంలో అతను కరీంనగర్ కట్టరాంపూర్లోని ఇంటినెంబర్ 10-1- 311/1లో నివసిస్తున్నట్టు చూపుతూ అద్దె రసీదును అధికారులకు సమర్పించాడు. వాస్తవానికి ఆయన చిగురుమామిడి మండలంలోని ఒక గ్రామంలో తన సొంతింట్లో ఉంటున్నా డు. నగరపాలక సంస్థ రికార్డుల ప్రకారం చూస్తే సదరు ఇంటి యజమానుల పేరు బసవేని మల్లమ్మ, ఆర్ హన్మంతరావుగా ఉన్నది. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం బోగస్ పత్రాలను సమర్పించినట్టు స్పష్టమవుతున్నది.
తిమ్మాపూర్ మండలంలో పనిచేసే భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వోపాధ్యాయులే. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. కానీ, వారు హౌసింగ్‌బోర్డులోని ఇంటినంబర్ 5-7-23 అద్దె ఇంట్లో నివసిస్తున్నట్టు చూపి ఐటీలో హెచ్ఆర్ఏ మినహాయింపుల కోసం నకిలీ ఇంటి అద్దె రసీదును సమర్పించారు. సదరు ఇంటి యజమాని పేరు తడిసిన శ్యామ్ సుందర్‌గా చూపించారు. కార్పొరేషన్ రికార్డుల ప్రకారం ఆ ఇంటి యజమాని పేరు శ్రీమతి సరోజ.
మరో ఉపాధ్యాయుడు కరీంనగర్‌లోని తన సొంతింట్లోనే నివాసం ఉంటున్నాడు. కానీ, ఇంటినంబర్ 8-5-148/1లో ఉంటున్నట్టు చూపాడు. యజమాని పేరు దాసరి అనితగా పేర్కొన్నాడు. ఆమె పేరిట ఇంటి అద్దె రసీదును ఐటీ మినహాయింపు కోసం సమర్పించాడు. నిజానికి కార్పొరేషన్ రికార్డుల ప్రకారం చూస్తే సదరు ఇంటి యజమాని పేరు కనుకయ్యగా తేలింది.
ఒక మహిళా టీచర్ సొంతింట్లోనే ఉంటారు. కానీ, కరీంనగర్ కట్టరాంపూర్లోని ఇంటినంబర్ 8-7-200లో అద్దెకు ఉంటున్నట్టు, ఆ ఇంటి యజమాని పేరు కంకణాల శ్రీనివాస్ రెడ్డి అని చూపారు. ఆ ఇంటి అద్దె రసీదును ఐటీ మినహాయింపు కోసం సమర్పించారు. విచిత్రం ఏమిటంటే మున్సిపల్ రికార్డుల ప్రకారం ఆ ఇంటి యజమాని పేరు మర్రి సుందరమ్మ. ఇంకో సందర్భంలో ఇదే టీచర్ కరీంనగర్‌లోని రాంనగర్‌లోని ఇంటినెంబర్ 9-8-134/1లో నివసిస్తున్నట్టు చూపి, యజమాని పేరు కుంట రమణ గా పేర్కొన్నారు. ఆయన పేరిట రసీదు పొంది, మినహాయింపు కోసం సమర్పించారు. మరో విశేషం ఏమిటం టే ఇదే ఇంటి నంబర్ ఉన్న ఇంట్లో మరో ఉపాధ్యాయుడు కూడా అద్దెకు ఉంటున్నట్టు రికార్డులు సమర్పించాడు. ఆ రసీదులో ఇంటి యజమాని పేరు తోడెంగ నాగరాజు అని ఉన్నది. కానీ నగర పాలక సంస్థ రికార్డుల ప్రకారం చూస్తే ఇద్దరు ఉపాధ్యాయులు చూపిన ఇంటినంబర్తో ఎటువంటి ఇండ్లూ లేవు.