కొడిమ్యాల, మార్చి 11 : మండలంలోని గంగరాంతండా గ్రామ శివారులోని వన నర్సరరీలో మంగళవారం ఉదయం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు ఒక్కసారిగా వచ్చిన అలికిడితో చిరుత పులి వచ్చిందని భయంతో పరుగులు తీశారు. దీంతో పలువురు గాయపడ్డారు. అటవీశాఖ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాంతండాకు చెందిన భూక్యా దీపిక, భూక్యా గౌరి ఉదయం గ్రామ శివారులోని వన నర్సరీలో మొక్కలకు నీళ్లు పట్టేందుకు వెళ్లారు. అక్కడ పనులు చేసుకుంటుండగా సమీపంలోని అటవీ ప్రాంతంలో అలికిడి కావడంతో అటుగా చూశారు. చిరుత పులి కనిపించగా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స అందించారు. ఘటనా స్థలాన్ని కొడిమ్యాల ఫారెస్టు రేంజర్ గులామ్ మొహినొద్దీన్, సెక్షన్ అధికారి సుబ్బారావు, ముషిర్, సిబ్బంది పరిశీలించారు.
పులిని చూసిన గౌరిని అటవీ శాఖ అధికారులు పిలిపించుకొని, అమెకు నాలుగు రకాల ఫొటోలు చూపించారు. చిరుత పులి ఫొటో కూడా చూపించడంతో అధికారులకు కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో ఈ ప్రాంతంలో పెద్దపులి మాత్రమే ఉండేది. ప్రస్తుతం చిరుతను కూడా చూసినట్లు స్థానికులు తెలుపడంతో అ దిశగా గస్తీ నిర్వహించారు. ఫారెస్టు రేంజర్ మొహినొద్దీన్ మాట్లాడుతూ చిరుతకు సంబంధించిన అనవాళ్లు కనించలేదని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా పులికి హాని తలపెడితే అటవీ సెక్షన్ల ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని, రైతులు తమ పంటపొలాలకు ఉదయం 11 గంటలకు వెళ్లి సాయంత్రం 4 గంటల వరకు ఇంటికి చేరుకోవాలన్నారు. ఒక్క రోజుకు పెద్ద పులి 34 కిలో మీటర్లు నడుస్తుందన్నారు. ఇటీవలే ఫాజుల్నగర్లో పెద్దపులి కనిపించిందని తెలిపారు. వాటికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలిపారు. మండలంలోని గంగారాంతండ, సూరంపేట, దమ్మయ్యపేట, బోల్లెన్చెరువు, కొండాపూర్, రామకిష్టాపూర్, నల్లగొండ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.