CITU | కలెక్టరేట్, జనవరి 9 : రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది పవర్లూమ్ కార్మికులకు వెంటనే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల చేనేత జోలీ శాఖ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ వర్కర్ టూ ఓనర్ పథకానికి 1104 మంది కార్మికులకు కాలయాపన లేకుండా అమలు చేయాలని, అదేవిధంగా 60 మంది వార్పిన్ మిషన్లను వార్పిన్ కార్మికులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి 10శాతం యారన్ సబ్సిడీ పవర్లూమ్ కార్మికులకు వార్పిన్, అనుబంధ రంగాల కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. 2023 బతుకమ్మ చీరలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న వర్కర్ టూ ఓనర్ షెడ్ పథకాన్ని అమలు చేయకపోవడం సరికాదన్నారు. వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే కార్మికులకు అందించాలని, పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ధర్నాలు చేసినా ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. పార్కులో కార్మికుల కోసం కేటాయించిన వర్క్ షెడ్లను ఇతర కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం చేనేత జోలి శాఖ ఏడీకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పవర్లూమ్, వార్పిన్, అనుబంధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.