Ponnam Prabhakar | చిగురుమామిడి, నవంబర్ 22 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించాలని మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అనంతరం పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మహిళలు చదువుకుంటే ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్నారు.
కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా బాగుపడతాయన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, మంజూరైన ఇల్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో అర్హులైన మరో 3500 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, బస్సులు మరిన్ని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల యూనిఫామ్ బాధ్యత మహిళలకు అప్పగించామన్నారు. ఇందిరమ్మ చీరలు ప్రతీ ఇంటికి అందజేయాలని, బొట్టు పెట్టి చీరల పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మహిళలకు పెద్ద బిడ్డ వేస్తుందని అన్నారు.
అనంతరం మండలంలోని తొమ్మిది మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీవో కిరణ్ కుమార్, నాయకులు గీకురు రవీందర్, వంగర మల్లేశం, పోలు స్వప్న, రెంటాల లావణ్య తదితరులు పాల్గొన్నారు.