Woman protested | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 15: ‘ఊరిలో ఉన్న మూడెకరాల భూమి చెరువులో మునిగింది. డ్యాము కట్ట కింద నాటి ప్రభుత్వం మూడు గుంటల భూమి, ఉద్యోగమిచ్చింది. అనారోగ్యంతో నౌకరి చేయలే. ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకున్న. ఇప్పుడు నా కొడుకు ఎదిగిండు. నా నౌకరి కొడుకుకు ఇయ్యిమంటే ఇస్తలేరు. డ్యాంకింద ఇల్లు కట్టిండ్లని కూలగొడుతమంటూ నోటీసులు ఇచ్చిండ్లు, దీనిమీద కలెక్టర్‌ను ఇప్పటికే నాలుగుసార్లు కలిసిన నాకు న్యాయం చేయాలని వేడుకున్న, ఉద్యోగం కోసం నీటిపారుదల శాఖకు సిఫారసు చేసినా అంటూ కలెక్టర్ చెబితే రోజు ఆ అధికారుల చుట్టూ తిరుగుతున్న. హైద్రాబాద్‌కు వెళ్ళి ముఖ్యమంత్రి ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసిన ఏం ప్రయోజనం లేకపోయింది. నా కొడుక్కు నౌకరి ఇయ్యలేదు. ఎప్ టిఎల్ పేర డ్యాం కింద కట్టుకున్న ఇల్లు కూడా కూలగొడితే నేను, నా పిల్లలెక్కడికి వెళ్ళేదంటూ..’ అని ఓ మహిళ ప్రజావాణిలో బైఠాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వెళ్ళగక్కుతూ, శాపనార్ధాలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే… మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పిల్లి భారతి కుటుంబానికి గ్రామంలో మూడెకరాల భూమి చెరువు సమీపంలో ఉన్నది. చెరువు వెడల్పు చేయగా వీరి భూమి అందులో కలిసింది. వారికున్న ఆదరువు ఆ భూమి మాత్రమే కాగా, ఉన్నతాధికారులను కలిసి వేడుకోవటంతో నగరంలోని హస్నాపూర్ కాలనీలో మూడు గుంటల ఇంటి స్థలంతో పాటు భారతికి కలెక్టరేట్లో ఉద్యోగం కల్పిస్తూ, అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోగా, నెల రోజులపాటు మాత్రమే ఉద్యోగం చేసి అనంతరం అనారోగ్య కారణాలతో మానేసింది.
తన కుమారుడు ఎదిగి రావటంతో ఆయనకు తన ఉద్యోగం ఇప్పించాలని గత కొద్ది మాసాల క్రితం కలెక్టర్‌ను కోరగా, నీటిపారుదల శాఖలో అవకాశం కల్పించాలంటూ ఆదేశించినా, అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ, మరోవైపు తనకిచ్చిన ఇంటి స్థలంలో కట్టుకున్న ఇల్లు కూడా కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేశారని, తన కుటుంబ పరిస్థితేందంటూ సోమవారం ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారిస్తానంటూ కలెక్టర్ చెప్పగా సంతృప్తి చెందకుండా, తాను నెలల తరబడి ప్రజావాణికి వస్తున్నా ఫిర్యాదులు చేస్తున్నా. హైద్రాబాద్‌లో ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినా, తనకు మాత్రం న్యాయం జరగటం లేదు.
ఇదేమి ప్రభుత్వం, ఇదేం పాలన, పేదల పట్ల కనికరం చూపటం లేదంటూ అధికారులు, ప్రభుత్వంపై విరుచుకుపడింది. శాపనార్ధాలు పెడుతూ కన్నీటి పర్యంతం కాగా, పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల వద్దకు తాము తీసుకెళ్తామని చెప్పినా, ససేమిరా అంటూ తాడో పేడో తెల్చుకునే దాకా కదిలేది లేదని భీష్మిస్తూ, ప్రజావాణిలో బైఠాయించింది. దీంతో, మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను బలవంతంగా ఆడిటోరియం బయటకు ఎత్తుకెళ్ళారు. కాగా, ఈమె కుటుంబ పరిస్థితిపై నీటిపారుదల శాఖ అధికారులకు తెలిపి, ఆమె కుమారుడికి ఉద్యోగావకాశం కల్పించాలంటూ లిఖితపూర్వకంగా ఆదేశించినట్లు కలెక్టరేట్ అధికారులు పేర్కొంటున్నారు.