Yella Reddypet | ఎల్లారెడ్డిపేట, జూన్ 7: మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో నాటు మందు వాడడం తో మృతి చెంది ఉంటుందని మృతురాలి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నేవూరి లళిత(56) 20 ఏండ్ల నుంచి షుగర్, హై బీపీతో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగి చికిత్స చేయించుకున్నా తగ్గుముఖం పట్టకపోగా ఆరోగ్య పరిస్థితి మెరుగపడకపోవడంతో నాటు వైద్యులను సంప్రదించారు.
కాగా వారు అందించిన గోలీలు శుక్రవారం రాత్రి 9 గంటలకు తీసుకుని ఇంట్లో పడుకుంది. ఎంతసేపటికీ లేవక పోవడంతో ఆమె కుమారుడు కళ్యాణ్ వచ్చి చూసేసరికి నోట్లో నుంచి నురగ కక్కుతున్నట్లు గమనించాడు. వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్లలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకుపోవడంతో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ చెప్పారు.