Heart Attack | చిగురుమామిడి, జులై 23 : రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని నోటీసులు అందజేయడంతో ఆందోళనకు గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మొదటి విడతగా హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సుందరగిరి గ్రామంలో రోడ్డు ఇరువైపులా 40 ఫీట్లు చొప్పున గ్రామపంచాయతీ నెల రోజుల క్రితం గ్రామ ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి తీర్మానం చేశారు.
అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లకు మార్కింగ్ ఇవ్వడంతో పాటు నోటీసులు అందజేశారు. రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న బుర్ర మధురవ్వ (55) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేది. ఇల్లు పూర్తిగా కోల్పోతానని భావించిన మధురవ్వ గురువారం రోజువారి లాగే కూరగాయలు అమ్ముకొని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు వచ్చి మృతి చెందింది. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతామని బాధతోనే ఇటీవల తీవ్ర ఆవేదనకు గురవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా మృతురాలు కుటుంబాన్ని సర్పంచ్ జంగ శిరీష, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పరామర్శించారు.