heart attack | కోల్ సిటీ, ఆగస్టు 17: అమ్మ మరణించినా… ఆమె కళ్లు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని అమ్మ కళ్లను మట్టికో… నిప్పుతో ఆర్పించకుండా.. పుట్టెడు దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించడానికి మృతురాలి కుటుంబం నేత్రదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు సింగరేణి రామగుండం- 2 డివిజన్ ఓపెన్ కాస్ట్ – 3 ప్రాజెక్టు ఈపీ ఫిట్టర్ ఉద్యోగి కనపర్తి సమ్మయ్య. శనివారం రాత్రి సమ్మయ్య తల్లి సరోజన (78) హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందింది.
ఆమె నేత్రాలను దానం చేస్తే ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత అనంతరాములు మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. తల్లిని కోల్పోయిన విషాదంలో కూడా అతని కుమారులు సమ్మయ్య, శ్రీనివాస్, శంకర్, కుమార్తె స్వరూప సమాజ హితం కోసం ఆలోచించి అమ్మ నేత్రాలను దానం చేయడానికి అంగీకరించారు.
దీనితో టెక్నిషియన్ నరేందర్ సాయంతో మృతురాలి కార్నియాలను సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంక్ కు తరలించారు. సరోజన కుటుంబ సభ్యులను సదాశయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, రమేష్, జిల్లా అధ్యక్షురాలు వెల్ది కవిత రామ్, చంద్రమౌళి ప్రత్యేకంగా అభినందించారు.