జగిత్యాల రూరల్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది. జగిత్యాల రూరల్ పోలీసుల కథనం ప్రకారం..జగిత్యాలలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన సామ సుజాత (42) కొత్త సంవత్సరం సందర్భంగా యేటా కుటుంబసమేతంగా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తుండేది.
కూతురు చిన్మయిరెడ్డి ఇటీవలే ఉన్నత చదువు కోసం కెనడాకు వెళ్లింది. భర్త మహేందర్‌కు పని ఉండడంతో సోమవారం ఉదయం ఒంటరిగానే స్కూటీపై హెల్మెట్ ధరించి పొలాస పాలస్తేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరింది. ఆలయ కమాన్ వద్ద మూల మలుగు తుండగా ధర్మపురి నుంచి జగిత్యాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొన్నది. ఆమె బైక్‌పై నుంచి ఎగిరి కిందపడ్డది.
హెల్మెట్ కూడా ఊడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సుజాతను అంబులెన్స్‌లో జగిత్యాల జిల్లా దవఖానకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత చికిత్స పొందుతూ మరణించింది. పోలీసుల సమాచారం మేరకు భర్త మహేందర్ జగిత్యాల దవాఖానకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యాడు. మహేందర్ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్ పోలీసులు పేర్కొన్నారు.