చందుర్తి, డిసెంబర్ 27: మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో బాది హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగవ్వ (45) అనే మహిళను సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో బాది హత్య చేశారు. కాగా మంగళవారం ఉదయం గ్రామంలోని గొర్లకాపరులు గుర్తించి, గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి సీఐలు కిరణ్కుమార్, వెంకటేశ్, ఎస్ఐలు నాగరాజు, ప్రభాకర్లు డాగ్ స్క్వాడ్ బృందంతో చేరుకొని ఆనవాళ్లు పరిశీలించారు. అనుమానమున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భూ తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై లింగవ్వ భర్త శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.