వనమహోత్సవ మొక్కల సిద్ధానికి ఆదేశాలు
నిర్వాహకుల ఆందోళన
Nursery | కలెక్టరేట్, మార్చి 28 : కంచంలో భోజనం అలాగే ఉండాలే… తినేటోళ్ల కడుపు నిండాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నదనే విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. నర్సరీల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండానే, వర్షాకాలంలో చేపట్టబోయే వనమహోత్సవానికి గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలు పెంచాలంటూ, ఒత్తిడి చేయటం పట్ల నిర్వాహకులు మండిపడుతున్నారు. ఏ నెలకు ఆ నెల అందించాల్సిన నిధులు నెలల తరబడి పెండింగులో పెట్టడంతో, మెయింటెనెన్సు కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు సతమతమవుతుండగా, వచ్చే సీజన్ కోసం మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేస్తుండడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చేపట్టబోయే వన మహోత్సవానికి అవసరమైన మొక్కలు గ్రామపంచాయతీల్లో నర్సరీల ద్వారా పెంచుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వీటిలో మొక్కలు సిద్ధం చేసేందుకు అవసరమైన ముడి సరుకుకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ముందుగానే నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ప్రణాళికలు సిద్ధం చేసి నాటబోయే మొక్కలకు సంబంధించిన విత్తనాలు సిద్ధం చేస్తారు. ఇందుకోసం అవసరమైన మట్టి, విత్తనాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతరత్రా సామాగ్రికి రూ.15 వేల వరకు అందజేస్తారు. ఉపాధి కూలీలకు చేస్తున్న చెల్లింపులతో పాటే, నర్సరీల్లో పని చేస్తున్న వారికి కూడా వేతనం విడుదల చేస్తున్నారు. ఈ నిధులను మాత్రం పెండింగ్లో పెడుతున్నారు.
జిల్లాలో మొత్తం 308 నర్సరీలు
జిల్లాలో మొత్తం 308 నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క నర్సరీలో 10 నుంచి 15 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. గతేడాది పెంచిన మొక్కలు కొన్ని మిగిలిపోగా, ఈసారి లక్ష్యాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. మొక్కలు దృఢంగా పెరిగే క్రమంలో విత్తన అభివృద్ధి కోసం అవసరమైన పోషకాలు కలిగిన మట్టి, చీడపీడల నివారణ కోసం వినియోగించేందుకు ఆవసరమైన మందులకు కూడా ప్రభుత్వం విడుదల చేసే కాంపోనెంట్ నిధులు సరిపోవడం లేదు. అయినా, కింద మీద పడి నర్సరీలు నిర్వహిస్తుంటే పాత చెల్లింపులు చేయకుండానే, తిరిగి కొత్తగా మొక్కలు పెంచాలంటూ ఆదేశించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో నర్సరీలు నిర్వహిస్తున్న చోట గ్రామ పంచాయతీలు బాధ్యత వహిస్తుండగా, మిగిలిన చోట్ల ప్రైవేటు వ్యక్తులు కొసాగిస్తున్నారు. వీరికి మెటీరియల్ కంపోనెంట్ కింద ఒక్కొక్క నర్సరీకి నెలకు రూ.15వేల దాక బకాయిపడ్డట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కాంపోనెంట్ నిధులు రాకపోవడంతో తాము అప్పులపాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను కరుణించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.