NREGS Job Cards | కరీంనగర్ కలెక్టరేట్, జులై 17 : గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఓవైపు క్షేత్ర సహాయకుల కొరత, మరోవైపు జాబ్ కార్డులు అందక, మొదటి విడతలోఎంపికైన వారిలో పూర్తిగా పంపిణీ చేయక పోవడం వెరసి కొత్తగా ఉపాధి పనులకు వెళ్తున్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 1,23,961 జాబ్ కార్డులు మాత్రమే..
జిల్లాలో 318 గ్రామ పంచాయతీలుండగా, 1,23,961 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 185 గ్రామాలకు మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. 133 గ్రామాలకు సహాయకుల్లేరు. వీటితో పాటు కొత్తగా మరో ఐదు పంచాయతీలు ఏర్పడగా, వీటికి కూడా నియమించాల్సి ఉన్నది. ఈ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే ఇంఛార్జీలుగా కొనసాగుతుండగా, చాలా చోట్ల వారు ప్రైవేట్ వ్యక్తును పెట్టుకుని పనులు నడిపిస్తుండగా, ఆయాచోట్ల ఉపాధి కూలీల పట్ల పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిలిచిన జాబ్ కార్డుల జారీ..
ప్రభుత్వం ఏడాది క్రితం నుంచి కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియ నిలిపేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడత రూ.6వేలను అందజేసే ప్రక్రియ జనవరి 26 నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియకు ఫుల్స్టాప్ పడింది జిల్లాలో అనేక మంది కొత్త జాబ్‌కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకుంటున్నా స్పందన లేదు. ఉపాధి కూలీలకు ఆత్మీయ భరోసా పంపిణీ చేస్తున్నామంటూ ప్రకటిస్తుండగా, కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి.
వీటిని సకాలంలో పరిశీలించి జాబ్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇంఛార్జీలుగా కొనసాగుతున్న వారు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు వెబ్సైట్ మూసివేయటంతో లబ్ధిదారులు కొత్తకార్డుల కోసం వేచిచూస్తున్నారు. మొదటి విడత లో ఎంపికైన వారికి ఆత్మీయ భరోసా జమ అవుతుండగా, తమకెప్పుడు జాబ్ కార్డులు అందేనో, భరోసా ఎపుడు వర్తింప జేస్తారోననే ఆందోళన మిగతా వారిలో వ్యక్తమవుతున్నది.
కొత్త కార్డుల పంపిణీకి ఉత్తర్వులు రాలేదు : శ్రీధర్, డీఆర్డీవో, కరీంనగర్
కొద్ది నెలలుగా కొత్తగా వస్తున్న కూలీలకు జాబ్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు విడుదల చేయలేదు. క్షేత్ర సహాయకులు లేనిచోట్ల గ్రామ పంచాయతీల కార్యదర్శులు పనులు పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా పనులు జరుగుతున్నాయి.