‘వినోదం, భావోద్వేగాల మేళవింపు ‘హే భగవాన్’. ఈ కథకు ముందు ఓ పది కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. ‘హే భగవాన్’ కథ, వినగానే మనసుకు నచ్చేసింది’ అని నిర్మాత బి.నరేంద్రరెడ్డి అన్నారు. సుహాస్, శివానీ నాగరం, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రధారులుగా ఆయన నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ ‘హే భగవాన్’. గోపి అచ్చర దర్శకుడు. బన్నీవాసు, వంశీ నందిపాటి కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న విడుదల కానుంది.
నిర్మాత బి.నరేంద్రరెడ్డి హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. ‘తండ్రీకొడుకుల ఎమోషన్స్ ఈ సినిమాకు హైలైట్. కథ విన్నప్పుడు నేను ఏ ఉద్వేగానికైతే లోనయ్యానో, రేపు సినిమా చూశాక ఆడియన్స్ కూడా అదే అనుభూతికి లోనవుతారు. ఆడియన్స్ ఊహకు అందని ట్విస్టులు కూడా ఉంటాయి. బన్నీ వాసు, వంశీ నందిపాటి విడుదల చేస్తుండటంతో సినిమా విజయంపై నమ్మకం రెట్టింపయ్యింది’ అని ఆనందం వెలిబుచ్చారు నిర్మాత బి.నరేంద్రరెడ్డి.