– నీటి పన్ను వసూలు నిలిపివేయాలని డిమాండ్
– కౌన్సిల్ సమావేశం లేకుండా ఆన్లైన్ బిల్లులు ఇవ్వకుండా మాన్యువల్ బిల్లు ఇవ్వడంపై అభ్యంతరం
– స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు నీటి పన్ను వసూలు చేయొద్దు
– ధర్నాలో పాల్గొన్న కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు
వైరా టౌన్, ఆగస్టు 04 : వైరా మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా వసూలు చేస్తున్న మంచినీటి పన్నుల బకాయిలు ఎలాంటి తీర్మానం లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కౌన్సిలర్లు కట్టా స్వరూప రాణి, తిరుపతి, శివకుమారి, చిలక చిన్న కోటయ్య, కిన్నెర కృష్ణ, మాదిరిని సునీత, దుర్గాప్రసాద్, నల్లమోతు శైలజ, జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు, బాణాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర్నుండి సుమారు 8 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంచినీటి పనులు వసూళ్లు జరగలేదని, కానీ వైరా మున్సిపాలిటీ పరిధిలో సిబ్బంది మూడు సంవత్సరాల బిల్లును ఒకేసారి వసూలు చేస్తూ సామాన్య ప్రజలపై అధిక భారం మోపుతున్నారన్నారు. దీన్ని అరికట్టేందుకు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎలాంటి ఆన్లైన్ బిల్లులు లేకుండా కేవలం ఆఫ్ లైన్ ద్వారా బిల్లులు వసూలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం కౌన్సిల్ తీర్మానం లేకుండా త్రాగునీటి బిల్లులు ఎలా వసూలు చేస్తారని కమిషనర్‌ను వారు ప్రశ్నించారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ.. ఆన్లైన్ బిల్లులు వచ్చేవరకు సిబ్బంది తాగునీటి బిల్లులు వసూలును తాత్కాలికంగా నిలిపివేస్తారని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహించి తీర్మానం ప్రతిపాదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దెల రవి, అప్పం సురేష్, పట్టణ మహిళా మాజీ అధ్యక్షురాలు బానోత్ సక్కుబాయి, నాయకులు మాదినేని దుర్గాప్రసాద్, నూకల వాసు, పుల్లయ్య, పాసంగులపాటి శివ, బత్తుల రాజు, కొత్త నరసింహారావు, మాచర్ల శంకర్, నరసింహారావు, కట్ట నాగేశ్వరరావు, వేముల శివకృష్ణ, రంజాన్, వదినేపల్లి చక్రవర్తి, గుగులోతు బాలు, వేరన్న, రేచర్ల సైదులు, వల్లెపు రాము పాల్గొన్నారు.