Delhi airport : సాధారణం విమానాలు ఎప్పుడైనా అరగంట లేదా గంట ఆలస్యంగా నడుస్తుంటాయి. వాతావరణం అనుకూలించకపోతే ఇంకా ఎక్కువ సయమం పడుతుంది. కానీ, స్పైస్‌జెట్ సంస్థకు చెందిన రెండు విమానాలు ఏకంగా 24 గంటలకుపైగా నిలిచిపోయాయి. దుబాయ్ వెళ్లాల్సిన విమానాలు 24 గంటలు గడిచినా బయల్దేరకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చివరకు ప్రయాణికులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. మంగళవారం వరకు ఇదే పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఎస్జీ 5111, ఎస్జీ 5105 అనే విమానాలు ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం ఉదయం ఒకటి, సాయంత్రం ఇంకొకటి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అయితే, విమానాలు ఎంతసేపటికీ బయల్దేరలేదు. అనేకసార్లు విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. దాదాపు 24 గంటలు గడుస్తున్నా విమానాలు బయల్దేరలేదు.
స్పైస్‌జెట్ సంస్థ నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. 24 గంటలుగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు. చివరకు విసుగెత్తి టర్మినల్-3 వద్ద సోమవారం సాయంత్రం నుంచి అనేకసార్లు నిరసనకు దిగారు. రెండు విమానాలకు సంబంధించి దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు స్పైస్‌జెట్ సంస్థను సంప్రదించారు. దీనిపై స్పందించిన సంస్థ ఈ ఆలస్యంపై విచారం వ్యక్తం చేసింది.
సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. అవసరమైతే ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసి, ప్రయణికుల్ని పంపిచే ఏర్పాట్లు చేస్తామని స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ సంస్థ నిర్వహణలో అనేక సమస్యల్ని ఎదుర్కుంటోంది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ప్రత్యేక దృష్టా సారించింది.