Ramagundam Baldia | కోల్ సిటీ, ఆగస్టు 9: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రక్షాళన జరగనుందా..? తాజా పరిణామాలు అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికేనా..? అన్న ప్రచారం వినబడుతోంది. కార్పొరేషన్లో ప్రధానంగా పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగంలోనే గత ఏడాదిన్నర కాలంగా అనేకానేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిన్నటికి నిన్న ఒకే రోజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హనుమంత రావు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ ను సీడీఎంఏకు సరెండర్ చేస్తూ ఇన్ఛార్జి కమిషనర్ ప్రకటించారు.
దీనితో ప్రక్షాళన దిశగా చర్యలకు సిద్ధమవుతున్నారా అన్న చర్చకు దారి తీసింది. మిగతా విభాగాల అధికారుల్లో ఒకింత ఆందోళన రేకెత్తిస్తుంది. పారిశుధ్య విభాగంలో ఇదివరకు ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండగా, వీరిలో తాజాగా కుమారస్వామి మంచిర్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. మిగతా ఇద్దరిలో కిరణ్ ను ప్రభుత్వంకు సరెండర్ చేయగా, ప్రస్తుతం నాగభూషణం విధుల్లో ఉన్నారు. కాగా, పెద్దపల్లి నుంచి డిప్యూటేషన్ పై రామగుండం నగర పాలక సంస్థకు వచ్చి జనన, ధ్రువీకరణ పత్రాల జారీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంపత్ కు తాజాగా శానిటరీ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి కల్పించి రామగుండం కార్పొరేషన్ కే కేటాయించారు. దీనితో ప్రస్తుతం ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు అందుబాటులో కొనసాగే పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో కూడా ప్రక్షాళన దిశగా అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. నగర పాలక సంస్థలో ఎంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు.
వీరి జీత భత్యాల భారం బల్దియాపై ఎంతగా ప్రభావం చూపుతుంది..? ఎవరెవరు ఎక్కడ విధుల్లో ఉంటున్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధుల మితిమీరిన జోక్యంతోనే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ ముఖ్య నాయకుడి అండదండలు ఉన్నాయన్న ధీమాతోనే ఇంతకాలం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై సరెండర్ వేటు వేయడంతో మిగతా అధికారులు అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఏఏ విభాగాల్లో ఎవరెవరు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న విషయంలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఐతే తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చర్యలను హర్షిస్తూ మిగతా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలపై కూడా దృష్టి సారించాలంటూ పలువురు నెటిజన్లు. మాజీ కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు శనివారం సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, ముఖ్య విభాగాల అధికారులతో సోమవారం అదనపు కలెక్టర్, కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.