Serf employees | కరీంనగర్ కలెక్టరేట్, మే 10 : గత కొద్దినెలల నుంచి బదిలీల కోసం వేచి చూస్తున్న గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ఉద్యోగుల నిరీక్షణ ఫలించేనా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా, సెర్ఫ్ లో మాత్రం చేపట్టలేదు. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. డీఆర్డీఏ అధికారులు కసరత్తు కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం వారి బదిలీలకు నాడు అవకాశమివ్వలేదు.
అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. అయినా పట్టించుకోక పోవటంతో పలుమార్లు రోడ్డెక్కారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సెర్ఫ్ ఉద్యోగుల బదిలీకి అవకాశమిస్తూ, రెండు రోజుల క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. కానీ, మార్గదర్శకాలు మాత్రం ఇప్పటివరకు ప్రకటించకపోగా, ఈ నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ ఎలా చేపడతారనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
కాగా, డిఆర్డీవో మినహా అన్ని కేటగిరీలకు చెందిన వారికి ఈసారి వంద శాతం స్థానచలనం ఖాయమంటూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనటంతో, మూడేళ్లకు మించి ఒకేచోట కొనసాగుతున్న ఉమ్మడి జిల్లాలోని కొంత మంది డిపిఎం స్థాయి ఉద్యోగులు ప్రస్తుతమున్న స్థానం నుంచి కదలకుండా ఉండేందుకు కారణాలు వెదుకుతున్నట్లు తెలుస్తున్నది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వస్తామనే ఆశతో ఉండగా, ఆశాఖలో ఇప్పటినుంచే మొదలైన పైరవీలు వారి ఆశలకు గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసమంజసంగా ఉత్తర్వులు..
సెర్ఫ్ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, ఉత్తర్వుల్లో పేర్కొన్న బదిలీకి అనుసరించే విధానాలపై కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేర్వేరు విభాగాలుగా పనిచేస్తున్నాయి. ఈ రెండింటిలో కొనసాగుతున్న ఉద్యోగులు వాటి పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతము సెర్ఫ్ లో మాత్రమే బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ఇందులో జిల్లా స్థాయిలో ఏపీడీలు, డీపీఎంలు, ఏపీవో, సిసీలు, ఎంఎస్ సీసీలు, అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో మొదటి రెండు కేడర్ల పోస్టులు రాష్ట్రస్థాయిలో, ఏపీఎం కేడర్ పోస్టులు జోనల్ స్థాయిలో, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ అసిస్టెంట్ తో సమానమైన ఏపీఎం కేటగిరి పోస్టులను మల్టీ జోన్ పరిధిలో చేర్చుతూ ఉత్తర్వుల్లో పేర్కొనడం పట్ల ఏపీఎంలు మండిపడుతున్నారు. జోనల్ పోస్టుకు సంబంధించిన వీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బదిలీలు జరిగితే, ఉమ్మడి జిల్లాలో కాకుండా ఇతర ఉమ్మడి జిల్లాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో, ఈ బదిలీలు తమకు కొత్త సమస్యలు తెచ్చి పెట్టబోతున్నాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. జిల్లాలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ప్రస్తుతం ఒక అదనపు డీఆర్డివో పోస్టు, 5 డీపీఎం, 19 ఏపీఎం, 63 సీసీ, 5 ఎమ్మెస్సీసి, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్టులు 5, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టుల్లో కొనసాగుతున్న వారందరికీ బదిలీ అవకాశం ఉంటుందని డీఆర్డిఏ వర్గాలు పేర్కొంటున్నాయి.