కార్పొరేషన్, జూన్ 4 : ‘నేను కరీంనగర్‌లోనే పుట్టా.. గెలిచినా, ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా. తుది శ్వాస వరకూ కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తా’ అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. నిత్యం ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. తన కోసం ఐదు నెలలుగా పని చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కరీంనగర్ భగత్‌నగర్‌లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును, కేసీఆర్ పాలనను బేరీజు వేసుకొని తమకు పట్టం కడుతారన్న విశ్వాసం కనిపించిందన్నారు. కానీ, ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్న ఆలోచనతోనే ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు వేశారని తెలిపారు. ఢిల్లీలో మోదీ ఉండాలనే అభిప్రాయంతో తెలంగాణ ప్రజలందరూ ఓట్లు వేశారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందు నుంచే బీజేపీ అయోధ్య రామాలయం, అక్షింతలను పంచి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుందని విమర్శించారు.
రామాలయం కట్టిన అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయిందని, ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఉత్తరాదిన ఓటమి చెందుతున్నారని తెలియడంతోనే 400 సీట్లు గెలుస్తున్నామని ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక వేవ్ క్రియేట్ చేశారని చెప్పారు. మీడియా, సోషల్ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారాలతో ఓట్లు దండుకున్నారని విమర్శించారు. బీజేపీకి 2019 ఎన్నికల కంటే ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు దీనికి మోడీ నైతిక బాధ్యత వహించాలన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని, ఇప్పటికైనా బండి సంజయ్ ప్రజా సమస్యలు, అభివృద్ధిపై పని చేయాలని హితవుపలికారు. సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్, నాయకులు చీటి రాజేందర్రావు, బాలకిషన్ రావు, ఆనంద్ పాల్గొన్నారు.
పొన్నం నోటి దురుసు వద్దు
మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకో. నోటి దురుసుతో ఏది పడితే మాట్లాడొద్దు. కరీంనగర్‌కు నా పీడ పోయిందని అనడం సరికాదు. నేను ఎంపీగా కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు తెచ్చినందుకు పీడ విరుగడ అయ్యిందా? జిల్లా ప్రజల ఎన్నో ఏండ్ల కళ అయిన హైదరాబాద్‌కు రైల్వేను మంజూరు చేయించి, ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించినందుకు పీడ విరుగడ అయిందా? చెప్పాలి. ఎంపీగా నీవు ఏం చేసినవ్? కరీంనగర్ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా తెచ్చినవా? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదు. అదృష్టం కొద్ది మంత్రి పదవి వచ్చింది. దానిని ప్రజల మంచి కోసం వినియోగించుకోవాలి. సమావేశాల్లో పక్కవారిని తొయ్యడం, కొట్టడం, నాపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏం పద్ధతి? ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పని చేయాలి కానీ, ఇలా వ్యక్తిగత దూషణలు చేయద్దు. నేను 2001లో గులాబీ జెండా పట్టి, 14 ఏండ్లు ఉద్యమం చేసిన. నాపై ఇలా విమర్శలు చేయడం మానుకో.
– వినోద్ కుమార్