Revenue conferences | చిగురుమామిడి, జూన్ 21: తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 3 న కొండాపూర్ లో ప్రారంభమైన భూ భారతి రెవెన్యూ సదస్సు ఈనెల 20 న ఉల్లంపల్లిలో జరిగిన సదస్సుతో ముగిసింది. పలు గ్రామాల్లో రైతుల నుండి అనేక భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని రెవెన్యూ అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. ప్రధానంగా సాదాబై నామాలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.
వాటితో పాటు భూమి హద్దులు, పాసుబుక్కులు, మోటేషన్, విరాసత్, అసైన్మెంట్ భూములు మొదలగు వాటిపై దరఖాస్తులు రావడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన దరఖాస్తులు రెండు నెలలలో పరిష్కారం అవుతాయా అనే దిశగా రైతులు ఎదురుచూస్తున్నారు.గ్రామాల వారిగా సదస్సులు నిర్వహించడంతో అధికారుల చుట్టూ తిరిగే సమస్యలు తప్పాయని రైతుల పేర్కొన్నారు.
రెవెన్యూ సదస్సులు గ్రామాల వారిగా..
మండలంలోని 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి సదస్సులు నిర్వహించారు. ఇందుర్తి, చిగురుమామిడి, సుందరగిరి గ్రామాలలో రెండు రోజులపాటు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మొదటగా కొండాపూర్ లో 33, ముల్కనూర్ 97, ఇందుర్తి 778, చిగురుమామిడి 462, నవాబుపేట 109, రేకొండ 279, బొమ్మనపల్లి 182, సుందరగిరి 330, రామంచ 154, ముదిమాణిక్యం 59, ఉల్లంపల్లి 106 దరఖాస్తులు రావడం జరిగింది.
రెవెన్యూ సదస్సులకు కార్యాలయ సిబ్బంది అంతా హాజరు
ఈనెల 3న కొండాపూర్ లో ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సుకు మొదలుకొని చాలా గ్రామాలకు తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది మొత్తం హాజరయ్యారు. దీంతో కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తడంతో కొంతమంది సిబ్బందిని కార్యాలయంలో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. రామంచ రెవెన్యూ సదస్సుకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో పాటు కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ హాజరయ్యారు. మండలంలో అత్యధికంగా ఇందుర్తి 778 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా కొండాపూర్ లో 33 దరఖాస్తు నమోదు అయ్యాయి.
భూ సమస్యల పరిష్కారం కోసం రైతన్నల ఆశలు
భూభారతి రెవెన్యూ సదస్సులో రైతులు దరఖాస్తు చేసుకోగా పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో రైతన్నలు ఎదురుచూస్తున్నారు. 2 నెలల్లో సమస్యలు పరిశీలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ దిశగా సమస్యలు పరిష్కారం అవుతాయా.. అనే అనుమానాలను రైతుల నుండి వ్యక్తం అవుతున్నాయి. పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులకు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు స్థానిక నాయకులు హాజరై రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ప్రశాంతంగా రెవెన్యూ సదస్సులు
ముద్ధసాని రమేష్, తహసీల్దార్, చిగురు మామిడి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 2589 దరఖాస్తులు వచ్చాయి. వాటిని రెండు నెలలలో పరిష్కరించే దిశగా కృషి చేస్తాం. ఎక్కువగా సాదా బైనామాలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు రావడం జరిగింది. రేకొండ, ఉల్లంపల్లి గ్రామాలలో అసైన్మెంట్ భూముల దరఖాస్తులు రావడం జరిగింది. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తాం.