బోయినపల్లి/ గంగాధర, జూన్ 1 : పెండింగ్ బిల్లుల కోసం సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి సిద్ధమైన మాజీ సర్పంచులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడికి పిలుపునివ్వగా, హైదరాబాద్ వెళ్లకుండా ఎక్కడికక్కడ ముందస్తుగా నిర్బంధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అకనపల్లి కరుణాకర్‌ను అరెస్ట్ చేశారు. గంగాధర మండలం వెంకటాయపల్లిలో మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీమల్ల మేఘరాజును అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరితోపాటు చాలా మండలాల్లో మాజీ సర్పంచులతోపాటు బీర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాజీ సర్పంచులు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. తాము సర్పంచులుగా ఉన్నప్పడు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులు చేస్తారా..? అని నిలదీశారు. బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరి కొందరు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అకనపల్లి కరుణాకర్ మాట్లాడుతూ..
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్పంచుల బిల్లుల కోసం ఇందిరాపార్ వద్ద ధర్నాలో పాల్గొని, తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే బిల్లులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఆ మాటే మాట్లాడడం లేదని విమర్శించారు. బిల్లులు విడుదల చేయాలని తాము ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతుంటే, పరిషరించాల్సింది పోయి ఇలా రాత్రికి రాత్రే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్గార్గమని మండిపడ్డారు. అరెస్టులతో సర్పంచుల ఉద్యమాన్ని, పోరాట పటిమను అణిచివేయలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని వీడి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.